ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ పదవులను ప్రాణం కంటే మిన్నగా భావించే ఈ రోజుల్లో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులు కోవడం ఆషా మాషీ వ్యవహారం కాదు. అయితే మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తమ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులు కోవడం దేశంలో సంచలనం సృష్టించింది. సిద్ధూ రాజీనామా వార్తను అన్ని వార్తా చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఆయన త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఆప్ తరఫున ఆయన పంజాబ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు ప్రచారం సాగుతోంది. 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ఎంపీగా పని చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో సిద్ధూ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృతసర్ పార్లమెంట్ నియోజక వర్గాన్ని అరుణ్‌జైట్లీకి కేటాయించారు. దీంతో సిద్ధూ చాలా రోజులుగా ఖాళీగా ఉన్నారు. ఆయన భార్య నవజ్యోత్ కౌర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తమ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.