మరో రూ.50 కోట్లుపై కన్నేసిన బాహుబలి

బాహుబలి సినిమా ఇప్పటికే వసూళ్ల వర్షం కురిపించింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా వసూళ్ల ధాటికి పెద్దపెద్ద బాలీవుడ్ సినిమాలే బిత్తరపోయాయి. ఇప్పటివరకు ఈ సినిమా 6వందల కోట్ల రూపాయల పైగానే షేర్ సాధించింది. కొన్ని యూరోప్ దేశాల్లో సాధించిన వసూళ్లను ఇంకా దీనికి కలపలేదు. ఇదిలా ఉండగా… బాహుబలి సినిమా మరో 50కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయింది.
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా చైనా అంతటా బాహుబలి సినిమా విడుదలకాబోతోంది. ఈ శుక్రవారమే ఈ సినిమా పొరుగుదేశంలో సందడి చేయనుంది. ఇప్పటికే చైనా వెర్షన్ కు సంబంధించి బాహుబలి యూనిట్ భారీ ప్రచారం కార్యక్రమం నిర్వహించింది. చైనా టైటిల్ తో ట్రయిలర్స్, పోస్టర్లు విడుదల చేసింది. బీజింగ్, షాంఘై లాంటి మహానగరాల్లో పెద్దపెద్ద హోర్డింగ్ లు ఏర్పాటుచేసింది. మరోవైపు చైనా నుంచి ప్రత్యేకంగా మీడియా బృందాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి మరీ, స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూల్లో ప్రభాస్, రానా, తమన్న, అనుష్క అంతా పాల్గొన్నారు. 
చైనాలో ఇప్పటివరకు పీకేదే రికార్డు. ఎలాగైనా ఆ రికార్డును క్రాస్ చేయాలనేది బాహుబలి ఎత్తుగడ. అందుకే ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా విడుదలకానంత అత్యథిక థియేటర్లలో బాహుబలిని చైనాలో విడుదల చేశారు. తాజా ప్రయత్నంతో మరో 50కోట్ల రూపాయలు కొల్లగొట్టాలనేది యూనిట్ ప్లాన్. దీంతో తమ రికార్డు మరింత పదిలంగా ఉంటుందని బాహుబలి టీం భావిస్తోంది.