ప్రియాంక కోసం క‌ల‌వ‌రిస్తున్న యూపీ కాంగ్రెస్‌?

ప్రియాంక‌….ఓ ప్రియాంక అని ఉత్త‌రప్ర‌దేశ్ కాంగ్రెస్ నేత‌లు క‌ల‌వ‌రుస్తున్నారు. ఆమె రాక కోసం వేయి క‌ళ్ల తో ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లూ క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆమెకు యూపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీలో పూర్తి స్థాయి బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ది. ప్రియాంక ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక బ‌రిలోకి దిగితే మంచి ఫ‌లితాలు సాధించే అవ‌కాశ‌ముంద‌ని యూపీ కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. 2017లో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మితుల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇందిరాగాంధీ కుటుంబ వార‌సురాలైన ఆమెతో క‌నీసం 120 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఆమె నాన్న‌మ్మ ఇందిరాగాంధీ మాదిరిగానే ప్రియాంకకు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఆమేథీ, రాయ‌బ‌రేలీ నియోజ‌క వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ మ‌య్యారు.