అనుష్క సినిమాలో ఆది పినిశెట్టి

తమిళ సినిమాలతో హీరోగా మారి… డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా గుర్తింపుతెచ్చుకున్న ఆది పినిశెట్టి… సరైనోడు సినిమాతో టాలీవుడ్ విలన్ గా మారిపోయాడు. దర్శకుడు బోయపాటి శ్రీను… ఆదిని ఎంత వయొలెంట్ గా చూపించాలో అంతగా చూపించాడు. సరైనోడు సినిమా సక్సెస్ వెనక ఆది పినిశెట్టి పర్ ఫార్మెన్స్ కూడా కచ్చితంగా ఉంటుంది. సరైనోడు సినిమా ఆదికి ఇప్పుడు మరిన్ని అవకాశాలు తీసుకొస్తోంది. తాజాగా అనుష్క నటిస్తున్న ఓ సినిమాలో విలన్ గా నటించే అవకాశం ఆదిని వరించింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న భాగమతి సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించనున్నాడు. అశోక్ దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ సినిమాలో ఆది క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. అరుంధతి సినిమాతో సోనూసూద్ కు ఎంత పేరొచ్చిందో…. భాగమతి సినిమాతో ఆదికి అంతకంటే ఎక్కువ పేరొస్తుందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను మాత్రం బయటకు చెప్పడం లేదు. సినిమా ఓపెనింగ్ ను కూడా చాలా సీక్రెట్ గా కానిచ్చేశారు. మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైందనే విషయం కూడా చాలామందికి తెలీదు. ఇంత సీక్రెట్ గా షూటింగ్ ఎందుకు చేస్తున్నారనే విషయం తెలీదు కానీ… ఇందులో ఆది పినిశెట్టిని విలన్ గా తీసుకున్నారనే విషయం మాత్రం నెట్ లో వైరల్ అయిపోయింది.