మార‌థాన్ ర‌న్‌లో కుక్క…ప‌రుగులు!

వీధికుక్క‌లు సాధార‌ణంగా పిల్ల‌ల చేతుల్లో ఏమైనా ఉంటే లాక్కుపోతుంటాయి. కానీ బెంగ‌లూరులో ఒక కుక్క ఒక ర‌న్న‌ర్ విజ‌యాన్ని అలాగే లాక్కెళ్లిపోయింది. బెంగ‌లూరులో జ‌రుగుతున్న  మార‌థాన్ ర‌స్‌లో… ఎక్క‌డినుండి వ‌చ్చిందో కానీ ఒక కుక్క కూడా ప‌రుగులు తీయ‌డం మొద‌లుపెట్టింది.  అంతేకాదు, ఏదో క‌క్ష క‌ట్టిన‌ట్టుగా ఇథోపియ‌న్ ర‌న్న‌ర్‌కి అడ్డుప‌డి అత‌డిని వెంబ‌డించింది. దాని దెబ్బ‌కు పాపం ఆ ర‌న్న‌ర్ తొమ్మిదో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. మూల్ వాసిహ‌న్ అనే ఆ ఇథోపియ‌న్ ర‌న్న‌ర్ బెంగ‌లూరులో జ‌రుగుతున్న ప్ర‌పంచ 10 కె మార‌థాన్‌లో పాల్గొన్నాడు. మొద‌ట అత‌ను అంద‌రికంటే ముందున్నాడు. కానీ ఒక వీధి కుక్క అత‌నితో పాటు ప‌రుగులు తీస్తూ వ‌చ్చి అత‌ని కాళ్ల‌కు అడ్డుప‌డిపోయింది. తిరిగి ముందుకు సాగ‌డానికి అత‌ను దాన్ని త‌ప్పించుకోవాల్సి వ‌చ్చింది. అత‌ను ప‌రుగులు తీస్తూనే ఉండ‌టంతో ఆ కుక్క మ‌రింత‌గా రెచ్చిపోయి అత‌డిని వెంబ‌డించింది. దాని అడ్డు తొల‌గించుకుని వెళ్లేస‌రికి విజ‌యం కాస్తా అత‌ని చేజారిపోయింది. అలా ఆ  కుక్క అత‌ని జీవితంలోంచి ఒక విజ‌యాన్ని ఎత్తుకెళ్లిపోయింది.