నాన్న‌ని మేమే చంపేశాం….కాదంటున్నపోలీసులు!

లైంగికంగా వేధిస్తున్న తండ్రిని తామే చంపేశామ‌ని ఇద్ద‌రు టీనేజి అమ్మాయిలు చెబుతున్నారు.  ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌మ‌ని క‌డుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి నిరంత‌రం లైంగిక వేధింపుల‌కు గురిచేస్తుండ‌టంతో విధిలేక ఈ ప‌నిచేశామంటూ… వారు చెప్పిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉంది. అయితే పోలీసులు ఆ వీడియోని, బాలిక‌లు చెబుతున్న‌దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. బాలిక‌ల‌ తండ్రి క‌ర‌ణ్ సింగ్ అనుకోకుండా ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించాడ‌ని వారు కేసు న‌మోదు చేశారు. ఒక పోలీసు అధికారి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ, క‌ర‌ణ్‌సింగ్ శుక్ర‌వారం ఉద‌యం బాగా మ‌ద్యం సేవించి ఆ మ‌త్తులో త‌ల‌ను గోడ‌కు బ‌లంగా కొట్టుకుని మ‌ర‌ణించాడ‌ని తెలిపారు. అయితే వీడియోలో మాత్రం అమ్మాయిలు త‌మ తండ్రిని సుత్తితో ప‌లుమార్లు కొట్టిచంపేశామ‌ని చెప్పారు. దుప‌ట్టతో మొహం క‌ప్పుకున్న ఆ పిల్లల మాట‌లు అందులో విన‌బ‌డుతున్నాయి. హ‌తుని ప‌క్క‌న సుత్తి ఉన్న దృశ్యం కూడా అందులో క‌న‌బ‌డుతోంది.

క‌ర‌ణ్ సింగ్ హ‌త్య జ‌రిగిన వెంట‌నే అత‌ని భార్య త‌న ఐదేళ్ల కొడుకుని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. సింగ్ తాగుబోతు కావ‌టం వ‌ల‌న ఆ ఇంట్లో ఎప్పుడూ గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉండేవ‌ని ఇరుగుపొరుగు ఇళ్ల‌వారు చెబుతున్నారు. న‌గ‌ర ఎస్‌పి ఓమ్ ప్ర‌కాష్ వీడియో గురించి మాట్లాడేందుకు నిరాక‌రించారు. బాలిక‌లు వీడియోలో ఏం చెప్పారో త‌మ‌కు తెలియ‌ద‌ని, ఐపిసి సెక్ష‌న్ 304 ఎ ( నిర్ల‌క్ష్యం కార‌ణంగా మ‌ర‌ణం) ప్ర‌కారం ఎఫ్ఐఆర్‌లో ఏముందో అదే త‌మ‌కు తెలుసున‌ని, పోస్ట్ మార్ట‌మ్ రిపోర్టుకోసం ఎదురు చూస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. న్యాయాన్యాయాల విష‌యం ప‌క్క‌నుంచితే బాలిక‌ల‌ను చిక్కుల్లోంచి బ‌య‌ట ప‌డేసేందుకు పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నం అభినంద‌నీయ‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లేక‌పోతే బాలిక‌లు రిమాండ్ హోముల్లో, జైళ్ల‌లో నిజంగానే లైంగిక వేధింపుల‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌నే అభిప్రాయాలు ఆన్‌లైన్లో క‌న‌బ‌డుతున్నాయి.