ఆశ్ర‌య‌మిచ్చిన ఇంటికి…శోకం మిగిల్చారు!

ఇప్పుడు ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ విష‌యంలో….తెలిసిన వారితో జాగ్ర‌త్త‌గా ఉండండి…అనే నినాదం చాలా ముఖ్య‌మైన‌ది. తెలిసిన వారివ‌ల్ల‌నే వారికి ఎక్కువ ముప్పు ఏర్ప‌డుతోంది. ప‌శ్చిమ బెంగాల్‌,  బ‌ర్‌ద్వాన్‌ జిల్లాలోని జ‌మాల్ పూర్‌లో బుధ‌వారం ఈ దారుణం చోటుచేసుకుంది. తండ్రి స్నేహితులే ఆరేళ్ల బాలిక‌పై దారుణంగా అత్యాచారం చేసి హ‌త్య చేశారు. ఆశ్ర‌య‌మిచ్చిన ఇంట్లోనే చిచ్చుపెట్టారు. ఈ ప్రాంతంలో ఒక మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వ‌చ్చిన ఇద్ద‌రు స్నేహితుల‌ను బాలిక తండ్రి, బుధ‌వారం రాత్రి త‌మింట్లో ఉండాల్సిందిగా కోరాడు. ఆ రాత్రి త‌న నాన‌మ్మ ద‌గ్గ‌ర నిద్ర‌పోయిన బాలిక అర్థ‌రాత్రి నుండి క‌నిపించ‌లేదు. బాలిక, తండ్రి స్నేహితులు అదే ఇంట్లో మ‌రొక గ‌దిలో ప‌డుకున్నారు.

అయితే బాలిక క‌నిపించ‌క‌పోవ‌టంతో కంగారు ప‌డిన కుటుంబ స‌భ్యులు, ఇరుగుపొరుగువారితో క‌లిసి  ఆ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌న్నీ వెతికారు. ఆ ప్రాంతానికి స‌మీపంలో ఉన్న దామోద‌ర్ న‌దీతీర ప్రాంతంలో బాలిక శ‌వ‌మై ఉండ‌టం, ర‌క్తంతో నిండిన ఆమె దుస్తులు ప‌క్క‌న ప‌డేసి ఉండ‌టం క‌నిపించింది. ఈ దృశ్యం చూసిన‌వారిలో దుఃఖాన్ని, ఉద్రేకాన్ని నింపింది.  అక్కడ ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి త‌మ‌ ఇంట్లో ఉన్న ఆ ఇద్ద‌రు వ్య‌క్తులే ఈ ప‌నిచేసి ఉంటార‌ని బాలిక కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు బాలిక తండ్రి స్నేహితులు ఇద్ద‌రిని అరెస్టు చేశారు. వీరిలో సాహాదేబ్ మూడీ అనే వ్య‌క్తిపై విచార‌ణ‌ అనంత‌రం కేసు న‌మోదు చేశారు. మ‌రొక‌రిని సైతం విచారిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.