స‌హాయ‌కురాలిగా వెళ్లి…నిస్స‌హాయంగా మ‌ర‌ణించింది!

ఇంట్లో స‌హాయకురాలిగా ప‌నిచేసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లిన ఒక యువ‌తి (25), త‌న య‌జ‌మాని పెట్టిన చిత్ర‌హింస‌ల‌కు ప్రాణాలు కోల్పోయింది. అక్క‌డి కింగ్ సౌద్ ఆసుప‌త్రిలో ఆమె ప్రాణాలు వ‌దిలిన‌ట్టుగా రియాద్ నుండి గుర్తు తెలియ‌ని వ్య‌క్తి యువ‌తి  కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ ద్వారా వెల్ల‌డించాడు. అసిమా ఖ‌టూన్ గ‌త ఏడాది డిసెంబ‌రులో సౌదీ వెళ్లింది. హైద‌రాబాద్‌లోని డ‌బీపురా ఈమె స్వ‌స్థ‌లం. హౌస్‌మేడ్ వీసాలను రెండేళ్లుగా నిలిపివేయ‌టంతో అసీమా, బిజినెస్ విజిట్ వీసామీద 90 రోజులు అక్క‌డ ఉండేలా  వెళ్లింది. ఆ త‌రువాత ఆమె చ‌ట్ట‌వ్య‌తిరేకంగా త‌న య‌జ‌మాని నిర్భందంలో ఉండిపోయింది. క‌నీసం ఆమె ఎలా ఉంది అనే స‌మాచారం కూడా చాలారోజులు కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌లేదు. రెండునెల‌ల క్రితం అసీమా ఇంటికి ఫోన్ చేసి, త‌న య‌జ‌మాని అబ్దుల్ రెహ‌మాన్ ఆలీ మ‌హ‌మ్మ‌ద్ త‌న‌ను మాన‌సికంగా, శారీర‌కంగా హింసిస్తున్నాడ‌ని, కాపాడ‌మ‌ని త‌ల్లిని వేడుకుంది.  ఎలాగైనా త‌న‌ను ఆ న‌ర‌కం నుండి బ‌య‌ట‌ప‌డేయాల్సిందిగా మొర‌పెట్టుకుంది. అయితే అసిమా త‌ల్లి, కూతురిని విడిపించే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గానే ఆమె మ‌ర‌ణవార్త తెల‌వ‌డం విషాదం. అసిమా మ‌ర‌ణానికి మూడురోజుల ముందు తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ రాజీవ్ శ‌ర్మ అక్క‌డి ప్ర‌భుత్వానికి ఆమెని ర‌క్షించాలంటూ లేఖ రాశారు. కానీ ఏ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌కుండానే అసీమా నిండుప్రాణం బ‌ల‌యిపోయింది.