కోటిరూపాయ‌ల కారు…క‌రువు ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌!

ఈ రెండు మాట‌లు అస‌లు మ్యాచ్ కావ‌డం లేదు క‌దూ…  బిజెపి పార్టీ క‌ర్ణాట‌క రాష్ట్రాధ్య‌క్షుడు బిఎస్ ఎడ్యూర‌ప్ప త‌న‌కు బ‌హుమ‌తిగా వ‌చ్చిన కారుని వెన‌క్కు ఇచ్చివేయ‌కుండా ఉంటే క‌రువుకి గుర‌యిన ప్రాంతాల్లో ఆయ‌న కోటిరూపాయ‌ల కారులోనే ప‌ర్య‌టించి ఉండేవారు. క‌రువు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌బోతున్న ఆయ‌న‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది క‌దా… అని  కోటి రూపాయ‌ల స్పోర్ట్ కారు ల్యాండ్‌ క్రూస‌ర్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చారు ఆయ‌న అభిమాని ఒక‌రు. ఆ అభిమాని ఎవ‌రో కాదు, మాజీ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి మురుగేష్ నిరానీ. ఎడ్యూర‌ప్ప పార్టీ రాష్ట్ర  అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌యాణాలు చేయాల్సివ‌స్తుంది క‌నుక ఆ కారుని ఆయ‌న‌కు నిరానీ కానుక‌గా ఇచ్చార‌ట‌.

ఎడ్యూర‌ప్ప ఇదేవిష‌యాన్ని చెబుతూ, అది కొత్త‌కారు కాద‌ని,  పార్టీ సంబంధిత ప్ర‌యాణాల‌కోసం తాత్కాలికంగా వాడుకొమ్మ‌ని దాన్ని నిరానీ త‌న‌కు ఇచ్చాడ‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.  అయినా ఈ విష‌యాన్ని అధికార కాంగ్రెస్, ఇత‌ర పార్టీలు వ‌ద‌ల్లేదు. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న కారుని తిరిగి నిరానీకి ఇచ్చేయాల్సి వ‌చ్చింది. కొంత‌కాలం క్రితం  ముఖ్యమంత్రి  సిద్ధ‌రామ‌య్య ఖ‌రీదైన వాచిని పెట్టుకున్న‌ప్పుడు బిజెపి వ‌ర్గాలు నానా యాగీ చేసి, ఆ వాచీని తీసేదాకా వ‌దల్లేదు. అప్పుడు సిద్ధ రామ‌య్య కూడా ఆ వాచీ కొత్త‌ది కాద‌ని, అది బ‌హుమ‌తిగా వ‌చ్చింద‌ని చెప్పారు. అయినా విమ‌ర్శ‌ల‌ను భ‌రించ‌లేక దాన్ని ఆయ‌న ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. మొత్తానికి అలా…  క‌రువుతో అల్లాడుతున్న వారి వ‌ద్ద‌కు సౌక‌ర్య‌వంతంగా కోటిరూపాయాల కారులో వెళ్లే అవ‌కాశం ఎడ్యూర‌ప్ప‌కు లేక‌పోయింది.