అక్రమ సంబంధం అనుమానంతో భార్యని, భర్త పొడిచి చంపిన ఘటన ముంబయికి సమీపంలో ఉన్న ఓ పట్టణంలో జరిగింది. పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం… రాజేంద్ర సావత్ (48), రంజన (44)లు భార్యాభర్తలు. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం ఉంది. దాంతో ఇద్దరి మధ్యా ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఈ భార్యభర్తలు తమ ఇద్దరు కుమారులతో కలిసి ముంబయికి దగ్గరలో ఉన్న నల్లపోపర అనే పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్దకుమారుడి వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేంద్ర, అతనిపెద్ద కుమారుడు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. రంజన ఇళ్లలో పనిచేస్తుండేది. హత్య జరిగిన రోజు రాజేంద్ర ఇంటికి వచ్చేసరికి రంజన ఇంట్లో కనిపించలేదు. దాంతో ఆమెను పిలుచుకు రమ్మని కోడలిని పంపాడు. రంజన ఇంటికి వచ్చాక మళ్లీ గొడవ మొదలైంది.
ఈ గొడవలో రాజేంద్ర హఠాత్తుగా వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి భార్యని పొడిచేశాడు. ఆపబోయిన కోడలికి కూడా గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు పోగయి బాధితురాళ్లిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రంజన మృతి చెందింది. రాజేంద్ర, రంజన 2013లోనే విడిపోవాలని అనుకున్నారని తెలుస్తోంది. అయితే విడిపోయాక తమకున్న సొంత ఇంటిని తనకు రాసివ్వాలని రంజన కోరటంతో ఆ విడాకులు వాయిదా పడ్డాయి. చివరికి వారి మధ్య విభేదాలు ఇలా విషాదాంతంగా ముగిశాయి.