చిన్నారి మేధ‌స్సుకి కేసీఆర్ దీవెన‌!

ఆ బాలిక ఓ న‌డుస్తున్న గ్రంథం.  తెలంగాణపై స‌మ‌గ్ర సమాచారాన్ని నింపుకున్న ఓ పుస్త‌కానికి చిన్నారి రూపం ఉంటే ఆ పాప లాగానే ఉంటుంది. నాటి కాక‌తీయుల కాలం నుండి నేటి ముఖ్య‌మంత్రి కేసిఆర్ క‌ల‌ల వ‌ర‌కు తెలంగాణ‌ను త‌న మాటల్లో ఆవిష్క‌రిస్తోంది ఖ‌మ్మం బాలిక వి. ల‌క్ష్మీ శ్రీజ‌. మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న శ్రీజ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసిఆర్ ని త‌న ప్ర‌తిభాపాట‌వాల‌తో అబ్బుర‌ప‌డేలా చేసింది.  తెలంగాణ‌పై స‌మ‌గ్ర‌సమాచారాన్నే కాకుండా, కేసీఆర్‌ నాయ‌క‌త్వంలో జ‌రిగిన తెలంగాణ పోరాటాలు, ఆయ‌న‌ జీవిత విధానం, మాట్లాడేవిధానం త‌దితర అంశాల‌ను కూడా ల‌క్ష్మీ శ్రీజ అన‌ర్ఘ‌ళంగా చెబుతుంటే ముఖ్య‌మంత్రి మంత్ర‌ముగ్దులై విన్నారు. చిన్నారిని మెచ్చుకుంటూ  సొంత‌ఖాతా నుండి  రూ. 10.16 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అందించారు.

శ్రీజ ఆదివారం త‌ల్లిదండ్రులు సుధారాణి, కిర‌ణ్ కుమార్‌ల‌తో క‌లిసి సీఎం నివాసంలో ఆయ‌న‌ను క‌లిసింది. కాక‌తీయుల కాలం నాటి చ‌రిత్ర నుండి నిజాం న‌వాబుల పాల‌న‌, స్వాతంత్ర్యం త‌రువాత తెలంగాణ ప‌రిస్థితి, స‌మైక్య ఏపీ ఏర్పాటు, తెలంగాణ‌పై వివ‌క్ష‌లు, ప్ర‌త్యేక ఉద్య‌మం….ఈ వివ‌రాల‌న్నింటితో పాటు తెలంగాణ‌లో మంత్రుల పేర్లు, రాష్ట్రంలోని ప‌థ‌కాలు లాంటి స‌మ‌కాలిన అంశాల‌మీద కూడా శ్రీజ త‌డుముకోకుండా చెబుతుంటే కెసీఆర్ ఆమె జ్ఞాప‌క‌శ‌క్తికి, ప‌రిజ్ఞానానికి ఆశ్చ‌ర్య‌పోయారు.  అప్ప‌టిక‌ప్పుడు రూ.10.16 లక్షలను చెక్కురూపంలో అందించారు. ఆమె బాగా చ‌దువుకుని వృద్ధిలోకి రావాల‌ని, తెలంగాణ కీర్తిని చాటాల‌ని దీవించారు. శ్రీజ‌, ఆమె త‌ల్లిదండ్రుల‌తో పాటు భోజ‌నం చేసిన కేసీఆర్‌, ఖ‌మ్మం వ‌చ్చిన‌పుడు వారింటికి వ‌స్తాన‌ని,  భోజ‌నం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.