మనుస్మృతి కాపీలను ఎందుకు తగులబెట్టారో చెప్పమంటూ షోకాజ్ నోటీసులు అందుకున్న జెఎన్‌యు విద్యార్థులు, యూనివర్శిటీ పాలనా యంత్రాంగం ముందు హాజరయ్యారు. సనాతన ధర్మసూత్రాల గ్రంథాన్ని ఎందుకు తగులబెట్టారు… అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అందులో తప్పేముందని ముగ్గురు విద్యార్థులు ఎదురుప్రశ్నవేశారు. సమాజంలో తిరోగమనం వైపు ఉన్నవాటిని, అసంబద్ధంగా ఉన్నవాటిని ప్రశ్నించే హక్కు తమకుందని, ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా తాము మనుస్మృతిని తగుల బెట్టామని ఒక విద్యార్థి అన్నారు. మరో ఇద్దరు కూడా దాదాపు ఇదేతరహా సమాధానాలు ఇచ్చారని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల ఎనిమిదిన యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉన్న సబర్మతి దాబా వద్ద విద్యార్థులు మనుస్మృతిలోని కొన్ని భాగాల కాపీలను తెచ్చి తగులబెట్టారు. తాము వివరణ ఇవ్వాల్సిన నేరం ఏమిచేశామో నోటీసుల్లో తెలపలేదని కూడా విద్యార్థులు అన్నారు.
పార్లమెంటుపై దాడి ఘటనలో ఉరిశిక్షకు గురయిన అప్జల్ గురుకి అనుకూలంగా యూనివర్శిటీలో కార్యక్రమాన్నినిర్వహించినట్టుగా చెబుతున్న రోజుకి దాదాపు నెల తరువాత కొంతమంది విద్యార్థులు యూనివర్శిటీలోని సబర్మతి ఆశ్రమంలో మనుస్మృతి ప్రతులు తగుల బెట్టారు. ఎబివిపి రెబల్స్, లెఫ్ట్ పార్టీల అండవున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యార్థులు ఈ సంఘటనలో పాల్గొన్నారు. కాగా ఈ విషయంలో యూనివర్శిటీ అధికారులు ఐదుగురు విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.