పేప‌రు వేస్తూ…ప్రాణాధార నీటిని కాపాడుతూ….

మంచిప్ర‌య‌త్నం అనేది ఏ స్థాయిలో అయినా, ఎవ‌రైనా చేయ‌వ‌చ్చ‌ని వారు ప్ర‌పంచానికి మ‌రొక‌సారి తెలియ‌జెప్పారు. కొల్హాపూర్‌లో న్యూస్ పేప‌రు వేసే న‌లుగురు వ్య‌క్తులు త‌మ వృత్తి ప‌నితోపాటు మ‌రొక మంచి ప‌నికి కూడా న‌డుం బిగించారు. వారు కొల్హాపూర్‌లో త‌మ‌కు కేటాయించిన ప్రాంతాల్లో పేప‌రు వేస్తూనే ఆయా ప్రాంతాల్లో వృథాగా పోతున్న నీటిపంపుల‌ను క‌ట్టేసుకుంటూ వెళుతున్నారు. కిర‌ణ్‌, సునీల్‌, శ‌శికాంత్‌, సునీల్ చావ‌న్‌ అనే ఈ న‌లుగురు… సైకిల్‌మీద పేప‌రువేయ‌డానికి వెళుతూ దృష్టంతా మంచినీటి పంపుల‌మీదే పెడుతున్నారు. చాలామంది ఇంటిముందు పైపులు వ‌దిలేసి నిద్ర‌పోతుంటార‌ని, అలాగే తెల్ల‌వారుజామున 2గంట‌ల‌కు నీరు వ‌చ్చే ప్రాంతాల్లో కూడా నీరు వృథాగా పోతుంటాయ‌ని వీరు చెబుతున్నారు. తాను పేప‌రువేసే ప్రాంతాల్లో కూడా అదే స‌మ‌యంలో నీళ్లు వ‌స్తాయ‌ని అందుకే పైపులు క‌ట్టేసి నీరు వృథాగా పోకుండా చూడాల‌నే తాను 2 గంట‌ల‌కే ఇంట్లోంచి బ‌య‌లుదేరుతాన‌ని కిరణ్ అంటున్నాడు. ఒక ఇంటి య‌జ‌మాని ఎన్నిసార్లు చెప్పినా త‌న ఇంటిపైపుని బాగుచేయించ‌క‌పోవ‌డంతో నీళ్లు వృథాగా పోతుండేవ‌ని, తాము ఆయ‌న‌కు ప్లంబ‌ర్ ఖ‌ర్చుని ఇస్తామనిచెప్ప‌డంతో మారాడ‌ని, త‌రువాత త‌న పైపుని బాగుచేయించుకుని నీరు వృథా కాకుండా చూస్తున్నాడ‌ని కిర‌ణ్ తెలిపాడు. మ‌నిషి క‌నీస బాధ్య‌త‌లు మ‌ర్చిపోతే క‌నీస అవ‌స‌రాలు క‌రువై పోతాయ‌ని గుర్తుంచుకోవాలి. ఈ దిశ‌గా ఆలోచిస్తున్న ఈ న‌లుగురు అభినంద‌నీయులు.