బెల్జియం రాజ‌ధానిలో భారీ పేలుళ్లు!

విమానాశ్ర‌యంలో రెండు…మెట్రోస్టేష‌న్లో ఒక‌టి

బెల్జియం రాజ‌ధాని బ్ర‌స్సెల్స్‌లో ఘోర‌మైన బాంబుపేలుళ్లు సంభ‌వించాయి. ఇక్క‌డి విమానాశ్ర‌యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం అమెరికా ఎయిర్‌లైన్స్ డెస్క్‌కి ద‌గ్గ‌ర‌గా డిపార్చ‌ర్‌హాల్ వ‌ద్ద రెండుసార్లు భారీ బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 13 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. అలాగే ప‌దుల సంఖ్య‌లో జ‌నం గాయాల‌పాల‌యిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ పేలుళ్ల‌కు గంట త‌రువాత  మేల్‌బీక్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద మ‌రొక బాంబుదాడి జ‌రిగిన‌ట్టుగా కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మెట్రో స్టేష‌న్ అమెరికా ఎంబ‌సీకి, యురోపియ‌న్ యూనియ‌న్ హెడ్‌క్వార్ట‌ర్స్‌కి చేరువ‌లో ఉంది. ఈ పేలుడులో కూడా చాలామంది గాయాల పాలైన‌ట్టుగా తెలుస్తోంది.

CeIp6ciW8AANf0Mవిమానాశ్ర‌యంలో ప్ర‌యాణీకుల‌ను అత్య‌వ‌స‌ర ద్వారాల‌నుండి త‌ర‌లించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు విమానాశ్ర‌యంలో త‌నిఖీలు చేప‌ట్టాయి. ప్ర‌మాద తీవ్ర‌త‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. పేలుళ్లు ఉగ్ర‌వాదుల ప‌నేన‌ని విమానాశ్ర‌య వ‌ర్గాలు భావిస్తున్నాయి. గతంలో పారిస్‌లో జ‌రిగిన దాడిలో నిందితుడైన స‌ల్లాహ్ అబ్దెస్లామ్‌ని బ్ర‌స్సెల్స్‌లో శుక్ర‌వారం అరెస్టు చేశారు. దాంతో అక్క‌డ హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. బెల్జియం ప్ర‌ధాని చార్లెస్ మైఖేల్ దీనిపై ట్విట్ట‌ర్లో స్పందించారు. గాయ‌ప‌డిన‌వారికి వేగంగా వైద్య‌చికిత్స‌లు అందిస్తున్నామ‌ని, ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ పేలుళ్ల‌ను త‌మ ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో ధృవీక‌రించిన విమానాశ్ర‌య అధికారులు అటువైపు ఎవ‌రూ రావ‌ద్ద‌ని తెలిపారు. లోప‌ల ఉన్న వారంద‌రినీ సుర‌క్షితంగా బ‌య‌ట‌కు పంపే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా వారు వెల్ల‌డించారు. విమానాల రాకపోకల్ని, విమానాశ్రయానికి వెళ్లే అన్ని రైలు, బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.