రేపిస్టు కొడుకుని పోలీసుల‌కు అప్ప‌గించిన త‌ల్లి!

షిల్లాంగ్ వాసి అయిన డ్లెట్ ష్యెమ్లీ అనే మ‌హిళ అస‌లైన త‌ల్లిమ‌న‌సంటే ఎలా ఉంటుందో ప్ర‌పంచానికి చాటింది. త‌న కొడుకు అత్యంత దారుణంగా పొరుగింటి అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే…ఆమె త‌న కొడుకుని కాక‌ ఆ అమ్మాయిని త‌ల్లిమ‌న‌సుతో చూసింది. కొడుకుని పోలీసుల‌కు అప్ప‌గించింది. ష్యెమ్లీకి 22 సంవ‌త్స‌రాల వికీ అనే కొడుకున్నాడు. అత‌ను, మ‌రో ముగ్గురితో క‌లిసి ప‌దిహేడేళ్ల త‌మ పొరుగింటి అమ్మాయిని, త‌మ ఇంటికి ద‌గ్గ‌ర్లో ఉన్న అడ‌విలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. కూతురిని త‌ల్లిదండ్రులు గుర్తించి ఆసుప‌త్రికి తీసుకువెళ్లేస‌రికే ఆమె మ‌ర‌ణించింది. మొట్ట‌మొద‌ట అడ‌విలో అమ్మాయిని చూసిన ఆమె స‌న్నిహిత బంధువుని పోలీసులు నేర‌స్తుడిగా అనుమానించి అరెస్టు చేశారు.

ఇది జ‌రిగిన తెల్లారి, ఆ అమ్మాయి చ‌నిపోయింద‌నే వార్త  తెలియ‌గానే,  విక్కీ త‌ల్లితో ఆ నేరంలో తానూ ఉన్నాన‌ని చెప్పాడు. అంతే ఆ త‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి కొడుకు చేసిన నేరం గురించి చెప్పింది. పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. విక్కీ నుండి స‌మాచారం సేక‌రించిన పోలీసులు మిగిలిన‌ ముగ్గురు నిందితుల‌ను కూడా అరెస్టు చేశారు. త‌న కొడుకు చేసిన ఘోర‌మైన నేరానికి త‌గిన‌ శిక్ష‌ప‌డాల్సిందేన‌ని ఆ త‌ల్లి కోరుతోంది. ఆమె చేసిన ప‌ని వ‌ల‌న నిర్దోషి అయిన హ‌తురాలి బంధువుని పోలీసులు విడుద‌ల చేశారు.

ష్యెమ్లీ చేసిన ప‌నిని ప‌లువురు అభినందిస్తున్నారు. ష్యెమ్లీ, ఖాసీ అనే సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌. వీరిలో కుటుంబంలో పిల్ల‌ల పెంప‌కంలో త‌ల్లుల పాత్ర ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే కొడుకు నేరానికి ఆ త‌ల్లి కూడా బాధ్య‌త వ‌హించింది.