అమితాబ్ బ‌చ్చ‌న్ జాతీయ‌గీతం పాడ‌టానికి డ‌బ్బు తీసుకోలేదు!

కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్‌లో శ‌నివారం ఇండియా పాక్‌ల మ‌ధ్య జ‌రిగిన  టి 20 క్రికెట్ పోరుకి ముందు అమితాబ్ బ‌చ్చ‌న్‌ జాతీయ గీతాన్ని ఆల‌పించారు. బిగ్‌బి ఈ పాటని పాడ‌టానికి, ప్రీ మ్యాచ్ సెర్మ‌నీలో క‌నిపించ‌డానికి నాలుగు కోట్ల రూపాయ‌లు తీసుకున్నార‌నే పుకార్లు సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి.  ఆ వార్త మీద చాలామంది స్పందించారు. ఆయ‌న దేశ‌భ‌క్తి ఇదేనా అని ప్ర‌శ్నించారు కూడా. దాంతో బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు.

 అమితాబ్‌కి తాము ఎంత‌గానో రుణ‌ప‌డి ఉంటామ‌ని, ఆయ‌న డ‌బ్బు తీసుకున్నార‌న్న పుకార్లు అన్నీ అబ‌ద్దాలేన‌ని, అస‌లు ఆయ‌న కోల్‌క‌తా మ్యాచ్‌కి రావ‌డానికి త‌న సొంత డ‌బ్బు 30 ల‌క్ష‌లు ఖ‌ర్చుచేశార‌ని గంగూలీ తెలిపాడు. ఆయ‌నే ఫ్లైట్ టికెట్లు కొనుక్కున్నార‌ని, హోట‌ల్ బిల్లులు కూడా ఆయ‌నే చెల్లించుకున్నార‌ని గంగూలీ తెలిపాడు. తాము అమితాబ్‌కి కొంత మొత్తం ఇవ్వాల‌ని ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఆయ‌న‌ ఒప్పుకోలేద‌ని,  ఇదంతా ప్రేమ‌తో చేశాన‌ని, ప్రేమ‌లో డ‌బ్బుకి తావులేద‌ని అమితాబ్ అన్నార‌ని గంగూలీ వెల్ల‌డించాడు. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు  అమితాబ్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ, అలాంటి నీచ‌పు విమ‌ర్శ‌ల‌ను పట్టించుకోకూడ‌ద‌ని, అలా చేస్తే వాటికి విలువనిచ్చిన‌ట్టు అవుతుంద‌ని అన్నారు. భార‌త్ గెలుపు, జాతీయ గీతం పాడే గౌర‌వం ద‌క్క‌డం…ఈ రెండింటి ప‌ట్ల ఆనందాన్ని అమితాబ్ టిట్వ‌ర్లో వ్య‌క్తం చేశారు.