తమిళనాడులో పట్టపగలు నడిరోడ్డుమీద దుండగులు మారణాయుధాలతో ఓ జంటపై దాడిచేశారు. దాడిలో భర్త మృతి చెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకునే క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. జనంతో రద్దీగా ఉన్న బస్‌స్టాండ్‌లో మధ్యాహ్నం మూడింటికి తిరుపూర్, ఉదుమల్పేట్లో ఈ దారుణం చోటుచేసుకుంది. దాడికి గురయిన శంకర్(22), కౌసల్య (19) ఎనిమిదినెలల క్రితం కులాంతరం వివాహం చేసుకున్నారు. ఇందులో శంకర్ దళితుడు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించినా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. శంకర్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించగా అతని సొంత ఊళ్లోనే కాపురం ఉంటున్నారు. కాగా పెళ్లి చేసుకున్న తరువాత చాలాసార్లు అమ్మాయి తరపువారు తమని బెదిరించారని హతుని తండ్రి తెలిపాడు. అతను రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.
ప్రత్యేక పోలీసు బృందాలు హంతకులు ముగ్గురికోసం గాలిస్తున్నాయి. హంతకులు హత్యచేసి పారిపోతుండగా చుట్టుపక్కల ఉన్నవారు సెల్ఫోన్లలో తీసిన ఫొటోలు పోలీసులకు ఆధారంగా ఉన్నాయి. కౌసల్య, శంకర్లు పొల్లాచ్చిలో ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజిలో కలిసి చదువుకున్నారని, అక్కడే వారిద్దరికీ పరిచయమై ప్రేమకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు. కౌసల్య సెకండియర్, శంకర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. పెళ్లి తరువాత కౌసల్య చదువు మానేయగా, శంకర్ కాలేజికి వెళుతున్నాడు. హత్య జరిగిన రోజు వారిద్దరూ షాపింగ్ కోసం ఉదుమల్పేట్ వచ్చారు. బస్టాండ్‌లో పట్టపగలు దుండగులు వారిద్దరిపై దాడిచేసినా, అందరూ చూస్తూ ఊరుకున్నారు కానీ, ఎవరూ అడ్డుకోలేదని పోలీసులు వెల్లడించారు. హంతకులు పారిపోయిన తరువాత అక్కడ ఉన్నవారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లేసరికే శంకర్ మరణించగా, కౌసల్య ప్రస్తుతం కొయంబత్తూరు మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతోంది.