మాల్యా…చిక్క‌డు…దొర‌క‌డు!

విజ‌య్ మాల్యా పేరుకి ఇప్ప‌టివ‌ర‌కు ఎన్ని విశేష‌ణాలైనా ఉండ‌వ‌చ్చు కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న‌కు మాల్యా…చిక్క‌డు, దొర‌క‌డు…అనే  ట్యాగ్‌లైనే బాగా సూట‌వుతుంది. మాల్యాకి వ‌చ్చిన ప్ర‌చారం ఎంత‌టిదంటే భార‌తీయులంతా ఆయ‌న వెంట‌బ‌డి వేటాడుతున్నారేమో అనిపించేంత‌. ఆయ‌న త‌న ఉద్యోగుల‌కు, అప్పుతీసుకున్న బ్యాంకుల‌కే కాదు, ఈ దేశంలో టివి చూస్తున్న ప్ర‌తి ప్రేక్ష‌కుడికీ స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి. అలాంటి విజ‌య్‌మాల్యాని ఇప్పుడు యుకె మీడియా త‌ర‌మ‌టం మొద‌లు పెట్టింది. ఈ ఉద‌యం ఒక ట్వీట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన మాల్యా…వాళ్లెంతగా వేటాడినా నేను మాత్రం చిక్క‌ను గాక చిక్క‌ను అని చెప్పేశాడు. వాళ్ల‌కి త‌న‌ని ఎక్క‌డ ప‌ట్టుకోవాలో తెలియ‌డం లేద‌ని, అయినా తాను మీడియాతో మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని, అందుకే మీడియా అన‌వ‌స‌రంగా త‌న‌ని వెంబ‌డించి స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌ద్ద‌ని మాల్యా కోరాడు.