క్రైమ్ పాత్ర‌లు చేసింది…క్రైమ్ బారిన ప‌డింది!

టివిలో క్రైమ్ క‌థా పాత్ర‌ల్లో న‌టించే ఆ న‌టి,  తాను కూడా స‌రిగ్గా అలాగే అలాంటి ప‌రిస్థితుల బారిన ప‌డుతుంద‌ని అనుకోలేదు. గ‌రిమా గోయిల్ అనే ఈ న‌టి క్రైమ్ పెట్రోల్, సావ‌ధాన్ ఇండియాల్లో బుల్లితెర‌మీద క‌నిపించింది. ఇటీవ‌ల ఆమె  ఇంట్లో ప‌నిచేసే వంట‌వాడు సంతోష్ ఇంటిల్లిపాదిమీద విష‌ప్ర‌యోగం చేశాడు. స‌మ‌యానికి వైద్య స‌హాయం అంద‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. గ‌రిమ గోయిల్‌ ఇంట్లో ఆమెతో పాటు  భ‌ర్త‌, కుమారుడు,  సోద‌రుడు ఉంటారు. కొన్ని రోజుల క్రితం తాను చెప్పిన‌ట్టుగా వంట చేయ‌లేద‌ని గ‌రిమ వంట‌వాడితో త‌గాదా పెట్టుకుంది. ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ జ‌రిగింది.  ఆ కోపం మ‌న‌సులో పెట్టుకున్న సంతోష్ ఆ త‌రువాత తాను చేసిన‌ దాల్ చావ‌ల్‌లో విషం క‌లిపి కుటుంబం మొత్తానికి పెట్టాడు. తిన్న‌వెంట‌నే అంద‌రికీ శ్వాస అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ వంట‌కాన్ని త‌క్కువ‌గా తిన్న గ‌రిమ సోద‌రుడు రాఘ‌వ్‌పై ఆ ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌డ‌లేదు. అత‌నే అంద‌రినీ ఆసుప‌త్రికి త‌ర‌లించాడు. టెర్ర‌స్‌మీద నిద్ర‌స్తున్న వంట‌వాడిని ప‌ట్టుకోవ‌డానికి కూడా రాఘ‌వ్‌ ప్ర‌య‌త్నించాడు.  కానీ అప్ప‌టికే అత‌ను అక్క‌డినుండి పారిపోయాడు.

తాము తిన్న ఆహారంలో విషం క‌లిసిన‌ట్టుగా డాక్ట‌ర్లు నిర్దారించార‌ని గరిమ తెలిపింది. అత‌ను త‌మ ఇంట్లో చాలా డ‌బ్బుఉంద‌ని భావించాడ‌ని, దాంతో ఉడాయించాల‌ని అనుకున్నాడ‌ని ఆమె అంది. ఎన్నో క్రైమ్ షోల్లో న‌టించిన త‌న‌కు నిజ‌జీవితంలో ఇలాంటి ప‌రిస్థితి ఎదురుకావ‌డం షాకింగ్‌గా ఉంద‌ని చెప్పింది. పోలీసులు సంతోష్‌ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.