హైదరాబాద్, డబీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్యకేసులో 19 సంవత్సరాల ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్టుచేశారు. బాల్ షెట్టి ఖేత్ ప్రాంతంలో అద్దెఇంట్లో నివసిస్తున్న 36 ఏళ్ల జీనత్ అలీ అనే మహిళ గత ఏడాది నవంబరు 3న దారుణ అత్యాచారం, హత్యకు గురయింది. ఆమె ఒక బట్టల దుకాణంలో పనిచేస్తుండేది. అయితే భర్త మరణించడంతో ఒంటరిగానే ఉండేది. నిందితుడు మీర్జా జీషన్ అలీఖాన్ తాత కూడా అదే బిల్డింగులోని ఒక వాటాలో ఉండేవాడు. దాంతో పురానీ హవేలీ ప్రాంతంలో నివసించే జీషన్ తాతవద్దకు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో అతనికి జీనత్ ఒంటరిగా ఉంటున్నట్టుగా అర్థమైంది. హత్య జరిగిన రోజు ఉదయం ఆరుగంటలకు జీషన్, జీనత్ ఇంట్లోకి గ్రిల్స్లేని కిటికీ ద్వారా ప్రవేశించాడు. బంగారం, డబ్బు దొంగతనం చేసే ఉద్దేశంతో అతను లోపలికి వెళ్లాడు. అతను బీరువా తీసి వెతుకుతుండగా జీనత్ మేల్కొని కేకలు పెట్టింది. దాంతో జీషన్ ఆమె అరవకుండా సెల్ఫోన్ చార్జింగ్ వైర్ని గొంతుకి బిగించాడు. జీనత్ స్పృహ కోల్పోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత ఆమె ఫోను తీసుకుని అక్కడ నుండి ఉడాయించాడు. అయితే ఈ ఘోర ఘటనలో జీనత్ ప్రాణాలు కోల్పోయింది. డబీపురా పోలీసులు ఈ కేసుని ఛేదించి జీషన్ని అరెస్టు చేశారు.