ఈమె… ఇంద్రాణీయేనా!

సొంత కూతురు షీనా బోరా హ‌త్య కేసులో జైల్లో ఉన్న ఇంద్రాణీ ముఖ‌ర్జీ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు  పెట్టుకుంది. ఇంద్రాణి ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నందు వ‌ల‌న ఆమెకు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ ఆమె లాయ‌రు 17పేజీల ద‌ర‌ఖాస్తుని సిబిఐ కోర్టుకి దాఖ‌లు చేశాడు.  షీనాబోరా హ‌త్య కేసు విచార‌ణ స‌మ‌యంలో మీడియాలో క‌నిపించిన ఇంద్రాణి ఫొటోల‌కూ, ఇప్పుడు ఆమె వాస్త‌వ రూపానికి చాలా తేడా ఉన్న‌ట్టుగా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆమె ఆరోగ్యం కుదుట‌ప‌డితే కానీ కోర్టులో విచార‌ణ‌ను ఎదుర్కొన‌లేద‌ని అందులో న్యాయ‌వాది పేర్కొన్నాడు.

ఇంద్రాణి ముఖ‌ర్జీ మెద‌డుకి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో అడ్డంకులు ఏర్ప‌డ్డాయ‌ని, దీనివ‌ల‌న‌ మెద‌డు స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం ఉన్నద‌ని, ఇంకా ఆమె త‌ల్లిని కోల్పోవ‌డంతో తీవ్ర‌మైన వేద‌న‌తో ఉన్నార‌ని అందులో పేర్కొన్నారు. అంతేకాక‌ ఇంద్రాణి, చూపు మంద‌గించ‌డం, గిడ్డీనెస్‌, ర‌క్త‌పు వాంతులు, ఛాతీ నొప్పి, నిద్ర‌లేమి త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని ఆమె త‌ర‌పు న్యాయ‌వాది బెయిల్ ద‌ర‌ఖాస్తులో తెలిపాడు. ఇంత‌కుముందు ఇంద్రాణి జైల్లో స్పృహ త‌ప్పి ప‌డిపోయిన‌పుడు ఆమెను జెజె ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు. అప్ప‌టి రిపోర్టుల వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తూ, జైల్లో ఆమె ఆరోగ్యం హ‌ఠాత్తుగా పాడ‌యితే, అనుమ‌తి లేకుండా జైలు అధికారులు వెంట‌నే స్పందించే వీలు లేదు క‌నుక బెయిలు కోసం అర్థిస్తున్న‌ట్టుగా బెయిల్ అప్లికేష‌న్లో పేర్కొన్నారు.