సునంద పుష్క‌ర్ హ‌త్య కేసులో కొత్త కోణం!

మాజీ కేంద్ర మంత్రి శ‌శిథ‌రూర్ భార్య సునందా పుష్క‌ర్ (51) హ‌త్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆమె శ‌రీరంలో పొలోనియం లేదా ఇత‌ర రేడియో ధార్మిక ప‌దార్థాల అవ‌శేషాలు లేవ‌ని అమెరికా అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌ ఎఫ్‌భీఐ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఎఫ్‌బీఐ నియ‌మించిన ప్ర‌త్యేక నిపుణుల బృందం ఈ విష‌యాన్ని తేల్చింది. దీంతో కేసు కొత్త మ‌లుపు తిరిగింది. ఎఫ్ బీ ఐ తాజా నివేదిక‌తో ఇంత‌కాలం ఎయిమ్స్ వైద్యులు అనుమానిస్తున్న‌ట్లుగా సునంద పుష్క‌ర్ మ‌ర‌ణానికి రేడియో ధార్మిక ప‌దార్థం కార‌ణం కాకుంటే మ‌రేమై ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. 
సునంద మృతి కేసులో తొలినుంచి కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఐపీఎల్ ఆర్థిక‌ లావాదేవీలు, శ‌శిథ‌రూర్‌తో జ‌రిగిన‌ గొడ‌వ‌లే సునంద మృతికి కార‌ణ‌మ‌ని అంతా అనుకున్నారు. త‌మ విభేదాల‌కు పాకిస్తాన్ జ‌ర్న‌లిస్ట్ మెహ‌ర్ త‌రార్ కూడా కార‌ణ‌మ‌ని సునంద మ‌ర‌ణించేముందు ఆరోపించిన విష‌యం తెలిసిందే! 2013లో శ‌శిథ‌రూర్, మెహ‌ర్ త‌రార్ క‌లిసి దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. 
అన్నీ అనుమానాలే!
1. 2014, జ‌న‌వ‌రి 17న ఢిల్లీలోని లీలాహోట‌ల్‌లో అనుమానాస్ప‌ద‌స్థితిలో సునంద పుష్క‌ర్ మ‌ర‌ణించారు. 
2. తొలుత ఆమె అధిక‌మోతాదులో మందులు తీసుకోవ‌డం కార‌ణంగా మ‌ర‌ణించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఆమెకు మందులు తీసుకునే స్థాయిలో ఎలాంటి వ్యాధులు లేవ‌ని మ‌ర‌ణించే కొన్ని రోజుల ముందు ఆమెను ప‌రీక్షించిన‌ త్రివేండ్రం కిమ్స్ వైద్యులు స్ప‌ష్టం చేశారు.
3. ఆమె మృత‌దేహంపై గాయాలు, మ‌ర‌ణించే కొన్ని గంట‌ల ముందు ఆమె ట్విట్ట‌ర్‌లో త‌న మ‌ర‌ణం గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం ఆమె మృతిపై ప‌లు అనుమానాలు రేకెత్తించాయి. 
4. ఇక ఆల్ ఇండియా మెడిక‌ల్ అండ్ సైన్సెస్ (ఎయిమ్స్‌) వైద్యులు ఇచ్చిన‌ అటాప్సీ రిపోర్టు అధిక‌మోతాదులో మందులు తీసుకోవ‌డం వ‌ల్ల సునంద మ‌ర‌ణించింద‌ని పేర్కొంది. ఈ నివేదిక ఆత్మ‌హ‌త్య‌ను స‌మ‌ర్థించేలా ఉంది. ఇక విస్కెరా నివేదిక, అంటే క‌డుపులో పేగుల‌ను ప‌రీక్షించి ఇచ్చే నివేదిక‌లో అలాంటి మందుల జాడ‌లేమీ లేవ‌ని వెల్ల‌డించింది. ఒకే కేసులో ప‌ర‌స్ప‌ర విరుద్ధ నివేదిక‌లు సునంద మ‌ర‌ణంపై అనుమానాలు తీవ్ర‌త‌రం చేశాయి. 
5. 2014 జులై 1న ఎయిమ్స్ వైద్యుడు సుధీర్ గుప్తా సునంద పుష్క‌ర్ కేసులో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసులో త‌ప్పుడు పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాల‌ని త‌న‌పై ఒత్తిడి వ‌చ్చింద‌ని వెల్ల‌డించ‌డం క‌ల‌క‌లం రేపింది. 
6. 2014, అక్టోబ‌ర్ 10న సునంద విషప్ర‌యోగం వ‌ల్లే మ‌ర‌ణించింద‌ని ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు.
7. 2015, జ‌న‌వ‌రి 6న సునంద పుష్క‌ర్ మృతిని అనుమానాస్ప‌ద కేసు నుంచి హ‌త్య కేసు మార్చారు. గుర్తు తెలియ‌ని వ్యక్తుల‌పై ఈ హ‌త్య కేసు న‌మోదు చేశారు.
8. ఆమెపై విష‌ప్ర‌యోగానికి రేడియో ధార్మిక ప‌దార్థాలు వాడి ఉంటార‌న్న అనుమానంతో కొన్ని న‌మూనాలను ఎయిమ్స్ వైద్యులు ఎఫ్‌బీఐ కి పంపి నివేదిక కోరారు.
9. ఈ విష‌యంలో థ‌రూర్ ఇంట్లో ప‌నివారు, డ్రైవ‌ర్‌ల‌కు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌లుమార్లు ఎంపీ శ‌శిథ‌రూర్‌ను ప్ర‌శ్నించారు.
10. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్యం ఈ కేసులో శ‌శిథ‌రూర్‌కు వ్య‌తిరేకంగా న్యాయ‌పోరాటం చేస్తున్నారు.