కేంద్ర మంత్రులపై మోడీ అసహనం

బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి భవిష్యత్ లో అనేక మార్పులకు నాంది కాబోతోంది. ఇప్పటికే ఈ ఓటమిని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ స్థాయి ఘోర పరాజయం ఊహించలేకపోతున్నారు. బీహార్ లో ఓటమికి కేంద్రమంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కారణమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే మార్పులు చేర్పులు జరుగుతాయని భావిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందంటున్నారు. కేంద్రమంత్రులుగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిని పక్కన పెట్టవచ్చని బీజేపీ నేతలే చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా మహేశ్ శర్మ, వీకే సింగ్ తదితర మంత్రులు గిరిరాజ్ కిషోర్ లాంటి ఎంపీలు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిలో ఉంటూ  మోడీని ఇరుకున పెట్టారు. కీలకమైన బీహార్ ఎన్నికలు ప్రచారం సందర్భంగా కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ చేసిన కుక్క వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదను కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్థులు ఈ కామెంట్ లను బీహార్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీకి సామాన్య ప్రజలు, అదీ మైనార్టీలు అంటే అలుసేనన్న భావన ప్రజల్లోకి తీసుకుపోయారు.
 మొత్తం మీద ఇంతకాలం తన మంత్రివర్గంలో ఉన్నవారు ఏం చేసినా పల్లెత్తు మాట అనని మోడీ.. ఇప్పుడు బీహార్ ఎన్నికల పరాజయంతో తప్పు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరి మంత్రివర్గంలో చోటు కోల్పోయేదెవరో? కొత్తగా పదవి దక్కించుకునేవారు ఎవరో తెలియాలంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యేవరకు ఆగాల్సిందే.