వారికి మరో శిక్ష వద్దు…వదిలేయండి

పదుల సంఖ్యలో ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్ ట్యాప్లు, కుప్పలకొద్దీ ఖాళీగా ఉన్న గర్భనిరోధక మాత్రల పెట్టెలు, ఐదువేల మంది అమ్మాయిల వివరాలు ఉన్న రిజిష్టర్లు..ఫోన్లలో పలువురు అమ్మాయిలకు మెసేజ్లు…బెదిరింపు కాల్స్…వీటన్నింటితో మధు అనే కీచకుడు పోలీసులకు దొరికాడు. ఒక భయానకమైన నేరం నిరాటంకంగా కొనసాగిందని చెబుతున్న సాక్ష్యాలు ఇవన్నీ. ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలకు ప్రతిరూపాలు. ఎంతమంది అమాయకులైన అమ్మాయిలు ఎన్ని రాత్రులు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చి ఉంటారో, భయంతో ఒణికిపోతూ మానసికంగా కుప్పకూలిపోయి ఉంటారో కళ్లకు కట్టినట్టుగా చెబుతున్న సాక్ష్యాలు. వందల కుటుంబాల్లో ఆరని చిచ్చుపెట్టిన భయంకరమైన నేరాలకు గుర్తులు. ఊహించుకుంటే ఆ అమాయకమైన ఆడపిల్లల రోదనలు కళ్లకు కట్టినట్టుగా కనిపించే పరిస్థితి అది.
ఇప్పటికైనా మధు అనే వేటగాడు పోలీసులకు చిక్కడం కాస్త ఊరటనిచ్చే విషయం. అతడిపై చట్టం చర్య తీసుకుంటుంది. అది తప్పనిసరి. అయితే ఆ చర్యల్లో భాగంగా విచారణ పేరుతో జరిగే ప్రహసనం, బాధితులైన అమ్మాయిలకు మరో ప్రమాదంగా మారకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దర్యాప్తు క్రమంలో మధు ఫోన్లు చేసిన అమ్మాయిల నెంబర్లు, అతను ఓవర్ అని రాసుకున్న అమ్మాయిల నెంబర్లు మరింత కీలకం. ముందు పోలీసుల దృష్టి వీరిమీదే పడే అవకాశం ఉంది. ఎందుకంటే అతని నేరాన్ని ధృవీకరించే ఆధారాలు వాళ్లు. కాబట్టి వీళ్లని ప్రశ్నించే క్రమం అంటూ ఒకటి మొదలుపెడితే వందల సంఖ్యలో అమ్మాయిలకు మరోసారి మానసిక సంఘర్షణ మొదలవుతుంది.
ఇప్పటికే భరించలేని బాధని అనుభవిస్తున్న ఆ అమాయకపు చిన్నారి తల్లులకు (వీరంతా పదిహేడు పద్దెనిమిదేళ్ల వారై ఉండే అవకాశం ఉంది) రక్షణవ్యవస్థ మరింత మనోవేదనని, మానసిక అంశాంతిని మిగిల్చినట్టే అవుతుంది. మోసగాడికంటే, మోసపోయిన అమ్మాయి ఈ సమాజంలో ఎదుర్కొనే పరిస్థితి ఏమిటో మనందరికీ తెలియంది కాదు. దర్యాప్తు పేరుతో ఇప్పటివరకూ ఎవరికీ తెలియని ఒక ముద్రని ఆ పిల్లలపై రక్షణవ్యవస్థే వేసినట్టు అవుతుంది.
వందమంది నేరస్తులు తప్పించుకున్నా ఫరవాలేదు, ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు అనే సూత్రంతో నడిచే మన న్యాయవ్యవస్థ తన సూత్రాన్ని యధాతథంగా ఆచరిస్తే ఆ అమాయకపు ఆడపిల్లలకు ఈ పీడకలను ఏ మాత్రం గుర్తు చేయకూడదు. ఎందుకంటే వారు ఒక్కక్షణం మళ్లీ ఆ పీడకలని గుర్తు చేసుకున్నా, దాని ఆధారంగా ఏ చిన్న విమర్శని భరించాల్సి వచ్చినా అది వారికి పడిన శిక్షే అవుతుంది..
మోసం ఎలా చేశాడు…ఏం చేశాడు అనేది స్పష్టంగా కళ్లముందున్నప్పుడు… ఇక ఆ బాధితులను మరింత బాధించకుండా వదిలేయడమే మంచిది. వంచకుడికి శిక్ష పడాలని ఆ అమ్మాయిలు మనస్ఫూర్తిగా ఆశిస్తుంటారు కానీ, ఆ శిక్షలో భాగంగా తాము మరిన్ని మనసుని గాయపరచే ప్రశ్నలను ఎదుర్కొనేందుకు వారు సిద్ధంగా ఉండరు గాక ఉండరు. ఎందుకంటే వారిలో అలాంటి ధైర్యం ఉంటే ఈపాటికి వారే ఫిర్యాదు చేసి ఉండేవారు. ఇప్పటికే బాధితులు అనుభవిస్తున్నది దుర్భరమైన పరిస్థితి. ఇంట్లో తెలిసి ఉంటే ఒకలా, తెలియకపోతే మరొకలా వారిలో ఒత్తిడి ఉంటుంది. మధు అరెస్టుతో తమకు ఎంతోకొంత ఉపశాంతి దొరికిందని భావించే ఆడపిల్లలకు ఆ మాత్రం శాంతిని కూడా లేకుండా చేయకూడదు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఆడపిల్లలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడమే మంచిది కదా అని. కానీ వారికి అలా ఎదుర్కొనాలని ఉన్నా…ఆ సమయంలోనూ, ఆ తరువాత వారి ఆత్మాభిమానం గాయపడకుండా చూడగలమనే మాటని మన పోలీసులూ ఇవ్వలేరు, సమాజం అసలే ఇవ్వలేదు. తాము అనుభవించిన క్షోభతో ఇప్పటికే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఉంటుంది. ఇలాంటి స్థితిలో అలాంటి గుర్తింపుని బహిరంగంగా ఇవ్వడం వలన వారికి జరిగే మేలు ఏముంది? వారు మరింత బలహీనపడి, మరింతగా కుంగిపోవడం తప్ప.