మా చెప్పుతో మేం కొట్టుకున్నాం

ఏపీ రాజధాని ప్రాంత గ్రామమైన గుంటూరు జిల్లా మల్కాపురంలో జగన్‌ పర్యటించారు. గురువారం గ్రామానికి చెందిన రైతు గద్దె చినచంద్రశేఖర్‌కు చెందిన ఐదెకరాల చెరుకు పంటకు దుండుగులు నిప్పు పెట్టిన నేపథ్యంలో జగన్ వెళ్లారు. దగ్ధమైన  చెరుకు పంటను పరిశీలించారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వలేదన్న కక్షతోనే ముఖ్యమంత్రి, మంత్రుల డైరెక్షన్‌లోనే రైతుల పొలాలను తగలబెడుతున్నారని జగన్ ఆరోపించారు.  చంద్రబాబు మానవత్వం అన్న గీతను దాటి అధికారమధంతో రాక్షసుడిలా మారారని విమర్శించారు. ఏడాదిగా రాజధాని ప్రాంతంలో రైతులను ఇలాగే వేధిస్తున్నారని మండిపడ్డారు.  తాను ఏం చేస్తున్నారో చంద్రబాబు ఒకసారి మనసాక్షిని ప్రశ్నించుకోవాలని కోరారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే కోర్టులో  కేసు వేస్తామని చెప్పారు.

ఈసందర్భంగా మాట్లాడిన బాధిత రైతు చంద్రశేఖర్ తాము మొన్నటి  ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేశామన్నారు. కానీ తమపైనా ఇలా దాడులు చేస్తున్నారని వాపోయారు. తమ చెప్పుతో తామే కొట్టుకున్నట్టుగా ఉందని రైతు ఆవేదన  చెందారు. తమకు ఈ దౌర్భాగ్యం వచ్చిందన్నారు.