వ్యభిచారం చేయలేక ప్రాణం తీసుకున్న కృపామణి

భర్తతో మనస్పర్థల కారణంగా ఇంటికి చేరిన కృపామణిని తల్లి, సోదరుడు వ్యభిచార కూపంలోకి దింపాలనుకున్నారు. ఆమె ఒప్పుకోకపోతే కృపామణిని, ఆమె కొడుకును చంపేస్తామని బెదిరించారు. ఈనేపథ్యంలో ఆమెను సాయి శ్రీనివాస్‌ అనే వ్యక్తికి రూ. 7 లక్షలకు అమ్మెశారు. వ్యభిచారకూపంలోకి దింపే ప్రయత్నంలో కృపామణి నిరాకరించినందుకు ఆమె నగ్న వీడియోలను నెట్‌లో పెడతామని బెదిరించడంతో విధిలేని పరిస్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. గతంలోనూ వేధింపులు తాళలేక తల్లిదండ్రులు, సాయిశ్రీనివాస్‌పై కృపామణి కేసు పెట్టింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా కృపారాణిని నిందితులు వేధింపులకు గురి చేశారు. అప్పటి నుంచి కృపామణికి వేధింపులు మరింత పెరిగాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. 
మరోవైపు తమ కోడలు బంగారు తల్లి అని కృపామణి అత్త వెంకటరమణమ్మ తెలిపారు. కృపామణి ఆత్మహత్యకు కారకులైన నిందితులను ఉరితీయాలి… లేకుంటే తానే చంపేస్తా అని ఆమె భర్త పవన్‌కుమార్ అంటున్నాడు. తల్లిదండ్రులు, సోదరుడు వ్యభిచారంలోకి దింపాలని చూస్తున్నారనే మనస్థాపంతో కృపామణి వేల్పూరులోని ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.