హంద్రీనీవా కాలువ గట్టుపై నరబలి!

హంద్రీనీవా కాలువ గట్టుపై తొమ్మిది నెలల పసికందును బలిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ దారుణం చోటు చేసుకుంది. యధాలాపంగా కాలువ గట్టుపైకి వెళ్ళిన స్థానికులకు బాలుడి మొండెం కనిపించింది. దీంతో వారు పోలీసులకు విషయాన్ని తెలిపారు. హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్న వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా బాలుడి మొండెంతోపాటు అక్కడ కొన్ని నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, నువ్వులు, ఇనుప మేకులు కనిపించాయి. బాలుడి తల మాత్రం దొరకలేదు. బహుశా క్షుద్ర దేవత వద్దకు దాన్ని తీసుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ బాలుడి వివరాలు కూడా తెలియరాలేదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.