ఢిల్లీలో కేసీఆర్ ఫోటో పీకి పారేశారు!

ఢిల్లీలోని ఏపీభ‌వ‌న్‌లో కేసీఆర్ ఫోటో తొల‌గించారు. ఎందుకు తొల‌గించారు? ఎవ‌రు తొల‌గించారు? అన్న అంశాల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికీ ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌స్తున్నార‌న్న అత్యుత్సాహ‌మే ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌న్న‌ది మాత్రం సుస్ప‌ష్టం. సోమ‌వారం ఉద‌యం ఏపీ భ‌వ‌న్‌లో తెలంగాణ‌, ఏపీ సీఎంల చిత్ర‌ప‌టాలు రెండూ ఉన్నాయి. మ‌ధ్యాహ్నం ఏపీ విలేక‌రుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం కావాల్సి ఉంది. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభమ‌య్యే స‌మయానికి కొన్ని నిమిషాల ముందు తెలంగాణ సీఎం ఫోటో తొల‌గించారు. దీన్ని గుర్తించిన ఓ తెలంగాణ జ‌ర్న‌లిస్టు తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్‌రావుకు సమాచారం అందించారు. ఆయ‌న వ‌చ్చి ఏపీ సిబ్బందిని నిల‌దీసినా ఎవ‌రూ స‌మాధానం ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న ఉంచితే.. రెండూ ఉంచండి..తొల‌గిస్తే.. రెండూ తొల‌గించాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో కేసీఆర్ ఫోటో కోసం కొద్దిసేపు వెదికారు. ఎంత‌వెదికినా దొర‌క‌లేదు. చేసేది లేక చంద్ర‌బాబు ఫోటో కూడా తొల‌గించారు. ఉద్యోగుల అత్యుత్సాహం కార‌ణంగా ఇద్దరు సీఎంల ఫోటోలు లేకుండానే స‌మావేశం నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. చంద్ర‌బాబు అంటే అభిమానం ఉంటే త‌ప్పులేదు గానీ మ‌రో సీఎంను త‌క్కువ చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.