షీనాబోరో హ‌త్యపై సీబీఐ ఎఫ్ఐఆర్‌!

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనాబోరా హ‌త్య కేసులో సీబీఐ ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేసింది. ఆర్థిక, కుటుంబ వివాదాలు తీవ్రం కావడంతో షీనాబోరాను క‌న్న‌త‌ల్లి ఇంద్రాణి ముఖ‌ర్జీ, ఆమె భ‌ర్త సంజీవ్ ఖ‌న్నా, డ్రైవ‌ర్ శ్యాంవ‌ర్ రాయ్‌లు క‌లిసి 2012 ఏప్రిల్‌లో హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే! ఈ కేసులో వీరిని ముంబై పోలీసులు దోషులుగా నిర్ధారించారు. ఈ హత్య కేసులో ముగ్గురిపై సీబీఐ మంగ‌ళ‌వారం ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేసింది. ఈ కేసు వెలుగు చూసిన‌ప్ప‌టి నుంచి అనేక మ‌లుపులు తిరిగింది. పోలీసుల అదుపులో ఉన్న ఇంద్రాణి నిజం అంగీక‌రించేంత వ‌ర‌కు కేసులో రోజుకో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డుతూ వ‌చ్చింది.
కేసును ప‌ర్య‌వేక్షిస్తున్న క‌మిష‌న‌ర్ రాకేశ్ మారియా ద‌ర్యాప్తులో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డాన్ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పుబ‌ట్టింది. వెంట‌నే ఆయ‌న్ను ప‌దోన్న‌తి పేరిట విచార‌ణ నుంచి ప‌క్క‌కు త‌ప్పించింది. దీంతో జాతీయ‌స్థాయిలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో బ‌దిలీ చేసినా… కేసును రాకేశ్ మారియానే ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌క‌ట‌న చేసింది. వారం రోజుల త‌రువాత కేసును సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్లుగా ఆ రాష్ట్ర హోంశాఖ ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో కేసు ద‌ర్యాప్తు నుంచి రాకేశ్‌ను పూర్తిగా త‌ప్పించి, త‌న పంతం నెర‌వేర్చుకుంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం.