అనుమానంతో భార్యను హత్య చేసిన కానిస్టేబుల్

అనుమానంతో… ఓ ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ తన భార్యను హత్య చేశాడు. పైగా తన భార్య కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా ఇచ్చాడు. అయితే కానిస్టేబుల్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని తమదైన శైలిలో ప్రశ్నించి విషయం రాబడితే నిజం బయటపడింది. భార్యను తానే చంపేసి అడవిలో కాల్చి పాతిపెట్టానని అంగీకరించాడు. ఇందుకు సంబంధించి నారాయణగూడ సీఐ భీంరెడ్డి కథనం ప్రకారం… రామకృష్ణ అనే కానిస్టేబుల్‌కు సుప్రియ అనే యువతితో గత ఏడాది వివాహం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత అమెపై అనుమానం పెంచుకున్న రామకృష్ణ కొద్దిరోజుల క్రితం టవల్‌తో సుప్రియ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా అనంతగిరి గుట్టల్లో శవాన్ని కాల్చేసి పాతిపెట్టాడు. కాగా… ఈ ఘాతుకానికి రామకృష్ణ స్నేహితుడు ప్రదీప్ సహకరించాడు. దీనిపై లోతుగా దర్యాప్తు నిర్వహించిన తర్వాత రామకృష్ణే ఈ కేసులో నిందితుడని తమకు తెలిసిందని, ఆ కోణంలో విచారించిన తర్వాత అసలు నిజం బయటపడిందని సీఐ భీంరెడ్డి తెలిపారు.