షాజహాన్‌ వినయం (Devotional)

అహంకారం ఉన్నమనిషి పేదవాడయినా, ధనవంతుడయినా ఒకటే. దానికి స్థాయితో సంబంధంలేదు. వినయం ఉన్న వ్యక్తి ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా వినయవంతుడే. “నేను” అన్నది మనసులో ఉన్నంత వరకు వ్యక్తికి ముక్తి ఉండదు.

షాజహాన్‌ మొగల్‌ చక్రవర్తి. తిరుగులేని అధికారంగల రాజు. ఆయన ఆజ్ఞకులోబడి అశేష సేనావాహిని ఉంటుంది. అందరూ ఆయనకు తలవంచుతారు. ఎంత గొప్పవాళ్ళకయినా కొన్ని సార్లు ఇబ్బందులు వస్తాయి. పరిస్థితులకు తలవంచక తప్పదు. అక్కడ అహంకారం పనిచెయ్యదు. అహంకరిస్తే నష్టం. అట్లాంటి ఒక పరిస్థితి చక్రవర్తి జీవితంలో జరిగింది. ఆ సంఘటన ఆయనలోని ఔన్నత్యాన్ని బయటపెట్టింది.

ఆరోజు దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. చక్రవర్తికి నిద్ర రాలేదు. పైగా దాహం వేసింది. చక్రవర్తి అన్ని అవసరాలు చూసే ఎందరో సేవకులుంటారు. అందువల్ల చిన్నపనులకు కూడా వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారు.

అది అర్ధరాత్రి. అందరూ గాఢనిద్రలో ఉన్నారు.

చక్రవర్తి “ఎవరక్కడ?” అని అధికార స్వరంలో పిలిచాడు. ఎవరూ బదులు పలకలేదు. చక్రవర్తికి దాహం ఎక్కువయింది. ఇంకోసారి పిలిచాడు. జనం అలికిడి లేదు. పడక దగ్గర ఒక నీటిపాత్ర ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అందుకుని చూశాడు. కానీ నీళ్ళు లేవు.

శరీరం నీళ్ళు కావాలంటోంది. సేవకులందరూ నిద్రలో ఉన్నారు. మొదట కాసేపు చక్రవర్తికి ఏంచెయ్యాలో తోచలేదు. నిద్రపోయే జనాల్ని లేపుదామా అనుకున్నాడు. మళ్ళీ ఎందుకులే అనుకున్నాడు. కానీ దాహంగా ఉంది. “సరే! నేనేవెళ్ళి బావిలో నీళ్ళు తోడుకుని తాగితే సరిపోతుంది కదా!” అనుకున్నాడు.

అంతఃపురాన్ని వదిలి బయటికి వచ్చాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. చంద్రుడు, చుక్కలు ఆశ్చర్యంతో చక్రవర్తినే చూస్తున్నాయి. అది ఆయనకు ఒక కొత్త అనుభవం. అటువంటి పరిస్థితి ఎప్పుడూ కలగలేదు.

దగ్గర్లో బావి కనిపించింది. బావి దగ్గరకు వెళ్ళాడు. తాడుకు కట్టిన బక్కెట్‌ కనిపించింది. బక్కెట్‌ తీసి బావిలో ఒదిలి తాడుపట్టుకున్నాడు. కాసేపు ఆగాడు. తనపదవి, తన చక్రవర్తిస్థానం గుర్తుకొచ్చి ఆయనకు నవ్వు వచ్చింది. చంద్రుడు ఉన్నాడు కానీ వెన్నెల కురిసేంతగా కాక మరీ సన్నగా ఉన్నాడు. అందువల్ల కొద్దిగా మసకమసగ్గానే ఉంది.

బక్కెట్‌ను నీళ్ళలో ముంచాడు. పైకి లాగాడు. గిలక శబ్దం చేసింది. మెల్లగా లాగి బక్కెట్‌ పైకి వచ్చాకా దాన్ని అందుకోవాలి. కానీ చక్రవర్తికి అది ఎప్పుడూ చేయని పని. అనుభవంలో లేనిది. తాడును బలంగా లాగాడు. బక్కెట్‌వచ్చి గిలకకు కొట్టుకుంది. నీళ్ళు ఒలికి చక్రవర్తి మీద పడ్డాయి. బక్కెట్‌ తలకు కొట్టుకుంది.

ఆ సంఘటనతో విస్తుపోయిన చక్రవర్తి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆకాశంలోకి చూసి “దేవా! నాకు ఈ అనుభవాన్నిచ్చినందుకు నీకు కృతజ్ఞుణ్ణి, బావినుండి నీళ్ళను తోడడానికి కూడా నేను అసమర్థుణ్ణి, అయినా నాపట్ల దయతో నన్ను ఈ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశావు. నీకు నేను బానిసను” అన్నాడు.

బాధలో కూడా దైవాన్ని స్మరించే వినయశీలి షాజహాన్‌ చక్రవర్తి.

– సౌభాగ్య