పరాశరుడు (For Children)

పరశురాముడు వేరు… పరాశరుడు వేరు!

వ్యాసుని తండ్రే పరాశరుడు! వశిష్ఠుని మనవడే పరాశరుడు!

పరాశరుని తల్లి అదృశ్యంతి. తండ్రి శక్తి. పరాశరుడు పుట్టే నాటికే తండ్రిలేడు. అతణ్ని రాక్షసుడు మింగేసాడు. ఇది తెలియని పరాశరుడు “అమ్మా నాన్నెక్కడున్నాడు చెప్పమ్మా?” అని అడిగాడు. చాలక “అమ్మా నువ్వు బొట్టూ కాటుక యెందుకు పెట్టుకోవడం లేదు?” అని అడిగాడు. “పూలు గాజులు వేసుకోవచ్చు కదా?” అని అడిగాడు. తల్లి దాచలేదు. నిజం చెప్పింది. చెప్పింది విని నాన్నను చూసివస్తానని బయల్దేరాడు పరాశరుడు. తను యెందుకు వచ్చిందీ తాతగారైన వశిష్ఠునికి చెప్పాడు. తోవ చూపమన్నాడు. శివుణ్ని వేడుకోమన్నాడు. పరాశరునికి పూజలకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. కోరకముందే తన తండ్రిని చూపించమన్నాడు. శివుని వర ప్రసాదాన పరాశరుడు స్వర్గంలో ఉన్న తండ్రిని చూడగలిగాడు.

అనుకున్నట్టే పరాశరుడు తండ్రిని చూసి వెనక్కి వచ్చాడు. తండ్రిలేని లోటయితే తీరలేదు. వేదన తీరలేదు. తన తండ్రిని చంపిన రాక్షసుణ్ణి, వారి జాతిని విడిచిపెట్టకూడదనుకున్నాడు. వినాశనం చెయ్యాలనుకున్నాడు. క్రతువు అంటే యజ్ఞం చేయడం మొదలు పెట్టాడు. దాంతో రాక్షస జాతి నాశనం మొదలయిపోయింది. పులస్త్యాది మునులందరూ దిగివచ్చారు. క్రతువు చేయవలదన్నారు. ఆపమని కోరారు. రాక్షసజాతి మొత్తానికి శిక్ష విధించడం తగదన్నారు. పరాశరుడు నెమ్మదించాడు. క్రతువుని ఆపేసాడు. అందులోని అగ్నిని హిమాలయాలకు ఉత్తరంగా విడిచి పెట్టాడు. తరువాత తీర్థయాత్రలకు బయల్దేరాడు. యమునా నదిలో పడవను నడిపే మత్స్యగంధిని చూసాడు. ఇష్టపడ్డాడు. కాని మత్స్యగంధి తలిదండ్రులు పరాశరునికి తమ కూతుర్ని ఇవ్వడానికి భయపడ్డారు. భయం లేదన్నాడు. కోరిక తీర్చమన్నాడు. కన్యత్వం కోల్పోదని అభయం ఇచ్చాడు. అంతేకాదు, శరీరం సౌగంధమయ్యేలా వరమిచ్చాడు. దివ్యాభరణాన్ని తెచ్చి కానుకగా ఇచ్చాడు.

యమునా తీరంలో చీకటి వాకిటిలో మత్స్యగంధిలో పరాశరుడు చేరాడు.

ఒక్కటయ్యారు!

వారి కలయికకు గుర్తుగా పుట్టినవాడే వ్యాసుడు!

– బమ్మిడి జగదీశ్వరరావు