తాగించి వితంతువుపై గ్యాంగ్ రేప్?

ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ గిరిజన వితుంతువుపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులు తమ కామవాంఛ తీర్చుకున్నారు. ఈమెకు బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనిస్తూ వచ్చిన వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ పెనుగులాటలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీనివల్ల తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో మాట్లాడలేని స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒంటిపై ఉన్న గాయాలను గమనించిన ఆమె కూతురు తన తల్లిపై లైంగికదాడి జరిగిందన్న నిర్ధారణకు వచ్చి చింతకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. తన తల్లిపై గ్యాంగ్‌రేప్‌ జరిగిందని, మగ్గురు వ్యక్తులపై తనకు అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చింతకాని మండలం గాంధీనగర్‌ కాలనీలో జరిగింది. ఇటీవల తన భర్త చనిపోయాక కూతురుకు వివాహం జరిపించి కూలి పనులు చేసుకుంటూ ఆ మహిళ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో రాత్రి ఆ మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెకు మద్యం తాగించి ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. తెల్లారిన తర్వాత ఒంటిపై దుస్తులు కూడా లేకుండా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి ఆమె కూతురకు సమాచారం అందించారు. ఆమె వచ్చి తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించి వారం రోజులుగా వైద్యచికిత్సలు చేయిస్తోంది. ఈ క్రమంలో సోమవారం తల్లికి బట్టలు మార్చుతుండగా ఒంటిపైన, చాతీపైన పలు చోట్ల గాయాలు ఉండటంతో గ్యాంగ్‌ రేప్‌ జరిగిందన్న విషయాన్ని తెలుసుకో గలిగింది. ఈకేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.