తప్పించుకున్న రామ్ చరణ్

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు రామ్ చరణ్. నిజానికి చిరు 150వ సినిమాను ఫస్ట్ ప్రకటించింది రామ్ చరణే. 150వ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారనే బ్రేకింగ్ న్యూస్ ను బయటపెట్టింది చెర్రీనే. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి పూరి జగన్నాధ్ తప్పుకున్నాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో కూడా ప్రకటించాడు. దీనిపై అడిగిన ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేదు చరణ్. చిరంజీవి కోసం పూరి కథ సిద్ధంచేస్తున్నాడని, ఫస్టాఫ్ కథ చాలా బాగుందని మాత్రం అన్నాడు. మరోవైపు రూమర్లకు బలమిస్తూ.. చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించడానికి వీవీ వినాయక్ కూడా సిద్ధంగా ఉన్నాడని ప్రకటించాడు. అంటే.. పూరి తప్పుకున్నాడని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడు రామ్ చరణ్. మొత్తమ్మీద చిరంజీవి 150వ సినిమా మళ్లీ మొదటికొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. చిరు కోసం వినాయక్ ఓ కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అఖిల్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. 150వ సినిమాపై స్పష్టత వస్తుంది. తాజా పరిణామాలు చూస్తుంటే.. వచ్చేనెల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 150వ సినిమాపై ప్రకటన ఉంటుందా ఉండదా అనే సందేహాలు కలుగుతున్నాయి.