తుపాకీ గురిపెట్టి పోలీసు అధికారి అత్యాచారం!

కోరిక తీరుస్తావా… చ‌స్తావా… అంటూ తుపాకీ గురిపెట్టి త‌న లైంగిక వాంఛ తీర్చుకున్నాడో పోలీసు అధికారి. యాభై యేళ్ళ వ‌య‌స్సు క‌లిగిన జైవీర్ సింగ్ అనే అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ అత‌ని వ‌య‌స్సులో స‌గం కూడా లేని ఓ యువ‌తిపై ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. పోలీసు శాఖ‌కే మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలే ఈ సంఘ‌ట‌న ప‌శ్చిమ ఢిల్లీలోని పంజాబీ పోలీస్ బాగ్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. బాధితురాలి క‌థ‌నం ప్ర‌కారం… బాగా తాగి ఉన్న స్థితిలో మ‌రో వ్య‌క్తితో త‌న ఇంట్లో ప్ర‌వేశించిన జైవీర్ అనే పోలీసు అధికారి త‌న‌ను భ‌యోత్పాతానికి గురి చేశాడ‌ని, కొంత‌సేప‌టి త‌ర్వాత త‌న‌తో వ‌చ్చిన వ్య‌క్తి పంపేసి త‌నపై తుపాకీ ఎక్కుపెట్టి త‌న కోర్కె తీర్చ‌క‌పోతే చంపేస్తాన‌ని బెదిరించాడ‌ని చెప్పింది. ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోతున్న స్థితిలో త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని ఆమె తెలిపింది. సంఘ‌ట‌న జ‌రిగిన రెండో రోజు తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని, సాక్ష్యంగా త‌మ వ‌ద్ద ఉన్న సీసీ టీవీ కెమెరా ఫుటేజీని అంద‌జేశాన‌ని ఈ యువ‌తి తెలిపింది. ప్రాథ‌మిక సాక్ష్యాధారంగా సీసీ టీవీ ఫుటేజీని తీసుకున్న పోలీసులు నిందిత అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ జైవీర్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అత్య‌వ‌స‌ర సాక్ష్యాధారం కింద వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.