ఎంపీ గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌కు పదవీగండం?

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌ పదవికి రోజులు దగ్గర పడ్డాయనిపిస్తోంది. సుప్రీంకోర్టు గురువారం వ్యాపం కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగించడం, ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు ఆయనకు నోటీసులు పంపడం కూడా జరిగింది. ఈనేపథ్యంలో ఆయన్ని పదవిలో కొనసాగించడం కష్టమని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఆయనపై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదై ఉంది. ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని గవర్నర్‌ ఒక్కొక్కరి వద్ద ఐదేసి లక్షలు లంచం తీసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. వ్యాపం కేసులో ఈయన తన కొడుకును కూడా పోగొట్టుకున్నారు.
ఈ కారణాలన్నింటి నేపథ్యంలో ఆయన్ని కొనసాగించడంపై కేంద్ర హోంశాఖ తర్జనభర్జన పడుతోంది. హోం శాఖ కార్యదర్శి ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌తో సమావేశమయినట్టు తెలిసింది. ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వెంటనే యాదవ్‌ తొలగింపు ఫైలును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. వాస్తవానికి గవర్నర్‌గా ఆయన పదవీకాలం సెప్టెంబర్‌ 2016తో ముగుస్తుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన రామ్‌ నరేష్‌ యాదవ్‌ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గవర్నర్‌గా కొనసాగడం వెనుక ఆయనకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌తో సత్సంబంధాలుండడమే. దీనికితోడు ఆయన గవర్నర్‌గా మధ్యప్రదేశ్‌ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శివరాజ్‌సింఘ్‌ చౌహాన్‌తో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. పదవీకాలం ముగిసే వరకు ఆయన కొనసాగుతారని అందరూ భావించారు. కాని వ్యాపం కుంభకోణంలో స్వయంగా ఆయన పాత్రపై నీలినీడలు కమ్ముకోవడంతో పదవీ గండం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. రామ్‌ నరేష్‌ యాదవ్‌కు రానున్నవి గడ్డురోజులేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.