లలిత్‌మోడిపై భారత్‌లో బిగుస్తున్న ఉచ్చు!

భారతదేశంలోని నాయకులపై తనదైన శైలిలో ఆరోపణలు చేస్తున్న ఐ.పి.ఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌మోడికి ఇక్కడ ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజేపైన, సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా, నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీపైన… ఆరోపణలు గుప్పించిన లలిత్‌ మోడికి… ఇపుడు అక్రమ నగదు చలామణి ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మూడు వారాల్లోగా హాజరు కావాలని ఆదేశించింది. గత వారం ఓ కేసు విచారణకు హాజరైన లలిత్‌మోడి లాయర్‌తో ఈ సమన్లు పంపించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. లలిత్‌మోడిపై కేసును ఈడీ పకడ్బందీగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన నాయకులపై ఇష్టారీతిన ఆరోపణలు చేసిన లలిత్‌మోడీని చట్టం చట్రంలో పకడ్బందీగా బిగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆదేశించడంతో ఈడీ ఈ కేసును అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తోంది. ఈ నెల 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఆలోగా లలిత్‌మోడిపై పక్కాగా చర్యలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆదేశించారని తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే ఈడీ లలిత్‌ కేసులో పావులు కదపాలని నిర్ణయించింది.
2008లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టెలివిజన్‌ హక్కులను రూ. 425 కోట్లకు ఇచ్చేందుకు ప్రపంచ క్రీడా బృందం (డబ్ల్యుఎస్‌జీ-మారిషస్‌), మల్టీ స్క్రీన్‌ మీడియా (ఎంఎస్‌ఎం-సింగపూర్‌)తో కుదుర్చుకున్న ఒప్పందంతో లలిత్‌మోడి కేసు ముడిపడి ఉన్నట్టు ఈడీ చెబుతోంది. దీనిపై భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) మొదట 2010లో చెన్నైలో శ్రీనివాసన్‌ ద్వారా కేసు నమోదు చేసింది. బీసీసీఐ మాజీ చీఫ్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ను గతవారం విచారించిన ఈడీ ఆయన ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసింది. 2012లో అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. సింగపూర్‌ సంస్థ నుంచి మారిషస్‌ సంస్థకు రూ. 425 కోట్ల మొత్తం బదలాయింపును అక్రమంగా తరలించడం ద్వారా విదేశీ మారక యాజమాన్య చట్టం (ఫెమా) ఉల్లంఘనకు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. ఒప్పందం ప్రకారం క్రికెట్‌ కంట్రోల్ బోర్డుకు ఈ మొత్తం అందాల్సి ఉండగా అనధికార లబ్దిదారులకు ఇది చేరిందన్నది ఈడీ అభియోగం.