డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 35 మందికి జైలు శిక్ష

జంట‌న‌గ‌రాల్లో పోలీసులు అకస్మాత్తుగా దాడులు చేస్తూ వంద‌లాది కేసులు న‌మోదు చేస్తున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా నాలుగు రోజుల‌పాటు నిర్వ‌హించిన దాడుల్లో 335 కేసులు న‌మోదయ్యాయి. ఇలా మద్యం తాగి వాహనాలు నడిపిన 35 మందికి హైదరాబాద్‌ స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జైలు శిక్ష, రెండు వేల రూపాయ‌ల వరకు జరిమానా విధించింది. వీరిలో 25 మందికి రెండు రోజులు, 8 మందికి ఒక రోజు, ఇద్దరికి కోర్టు సమయం ముగిసేవరకు కోర్టులోనే ఉండాలని శిక్ష విధించింది. జూన్‌ 24 నుంచి 27వ తేదీ వరకు ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించి 335 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ద్విచక్ర వాహనదారులు 239 మంది, మూడు చక్రాల వాహనదారులు ఆరుగురు, నాలుగు చక్రాల వాహనదారులు 85 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు.