బాహుబలి-2కు రచయితగా రానా

 వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజం. బాహుబలి సినిమాలో విలన్ గా నటించిన దగ్గుబాటి రానా, పార్ట్-2కు రచయితగా మారబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి కన్ ఫర్మ్ చేశాడు. రానాలో పైకి కనిపించని రచయిత ఉన్నాడని చెప్పుకొచ్చాడు రాజమౌళి. పార్ట్-1 షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ టీం అంతటికీ ఓ లెటర్ రాశాడు రానా. ఆ ఉత్తరంలో రానా చూపించిన భావోద్వేగాలు అద్భుతం అంటున్నాడు రాజమౌళి. రెండేళ్ల బాహుబలి జర్నీకి సంబంధించి రానా రాసిన ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారని చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే రానాను రచయితగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యానన్నాడు రాజమౌళి. సో.. మరో 4 నెలల్లో సెట్స్ పైకి వెళ్లనున్న బాహుబలి-2 సినిమాలో రానా కేవలం విలన్ గానే నటించకుండా.. రచయితగా కూడా వర్క్ చేయబోతున్నాడన్నమాట. నిజానికి రానా బాగా మాట్లాడతాడని, అతడిలో ఓ రచయిత, భావకుడు కూడా ఉన్నాడనే విషయాన్ని మొదట గుర్తించిన వ్యక్తి దర్శకుడు క్రిష్. కృష్ణంవందే జగద్గురుం సినిమా టైమ్ లో ఈ విషయాన్ని క్రిష్ కూడా ఓసారి చెప్పాడు. ఇప్పుడు రాజమౌళి రానాలోని ఆ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేశాడు.