మ‌ర‌ణించింది మాన‌వ‌మృగమా?

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం తెలియ‌ని పిల్ల‌..కష్టం, సౌఖ్యం, శ్లేషార్ధాలూ..ఏమీఎరుగని న‌వ్వులు రువ్వే పువ్వు.. ఐదారేళ్ల పాప‌.. మృగ‌వాంఛ‌కు బ‌లైపోయింది. ప‌శుత్వానికి ప‌రాకాష్ట‌గా నిలిచిన ఘ‌ట‌న‌లో పెట్టెలో ర‌క్తం ముద్ద‌య్యింది. చిన్నారిని చిదిమేసిన మాన‌వమృగం మ‌ర‌ణించింది. నేరాల బాట ప‌ట్టిన న‌ర‌రూప రాక్ష‌సుడిని న‌డిరోడ్డుపై శిక్షించింది స‌మాజం. పాల బుగ్గ‌ల ప‌సిపాప‌ను అంతం చేసిన ర‌క్త‌మాంసాలున్న జంతువును అత్యంత క్రూరంగా, అత్యంత హేయంగా త‌లారీ తానే అయి, తాడూ తానే అయి ఉరికంబం ఎక్కించింది జ‌నాగ్ర‌హం. మాన‌వ‌మృగం శ‌వమైనా వ‌ద‌ల్లేదు జ‌నం. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. న్యాయాన్ని అమ‌లు చేశారు. ఇది ఒక ప్ర‌మాద‌క‌ర సంకేతం. విశృంఖ‌లం జ‌డ‌లు విప్పి తొడ‌లు కొడుతుంటే.. వ్య‌వ‌స్థ‌లు చేష్ట‌లుడిగి చూస్తుంటే.. అన్ని చోట్లా ఇదే జ‌రుగుద్ద‌ని ఓ హెచ్చ‌రిక పంపుతోంది ఏలూరులో ఘ‌ట‌న‌. 
ఏం జ‌రిగిందంటే..!
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి ఇందిరాకాలనీకి చెందిన తియ్యాల రమేష్‌, అనుపమ దంపతులకు ముగ్గురు పిల్ల‌లు. పెద్ద‌దైన ఆరేళ్ల‌ లావ‌ణ్య‌ను ఈ నెల 16వ తేదీ రాత్రి కోడిగుడ్లు తీసుకురావాలంటూ త‌ల్లి దుకాణానికి పంపింది. అప్ప‌ట్నించి ఆ పాప అదృశ్య‌మైంది. రాత్రంతా వెదికారు. త‌రువాత రోజు త‌మ ఇంటికి ఎదురుగా ఉన్న గ‌నిగంటి సురేశ్‌ను లావ‌ణ్య త‌ల్లిదండ్రులు, స్థానికులు అనుమానించి నిల‌దీశారు. అయితే త‌న‌కేమీ తెలియ‌ద‌ని బుకాయించాడు సురేశ్‌. అయితే అత‌ని గ‌త చ‌రిత్ర తెలిసిన గ్రామ‌స్తులు చిత‌క‌బాదారు. అయినా నోరువిప్ప‌లేదు. స్టేష‌న్‌కు అప్ప‌గించారు. అయితే అక్క‌డ సురేశ్ త‌న క్రిమిన‌ల్ బ్రెయిన్ ఉప‌యోగించాడు. అమాయ‌కుడినైన త‌న‌ను గ్రామ‌స్తులు చిత‌క‌బాదేశార‌ని ఓ ఐదుగురిపై ఏలూరు రూర‌ల్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సురేశ్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అత‌డ్ని జిల్లా కేంద్ర ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ్నించి సురేశ్ త‌ప్పించుకున్నాడు. ఈ లోగా సురేశ్ ఇంట్లో ఓ ట్రంకుపెట్టెలో లావ‌ణ్య డెడ్‌బాడీ బ‌య‌ట‌ప‌డింది. అత్యంత దారుణంగా, హింసించి, బ్లేడుతో శ‌రీరాన్ని కోసి పెట్టెలో లావ‌ణ్య మృత‌దేహాన్ని కుక్కేశాడు. బాలిక మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింద‌నే స‌మాచారం కూడా పోలీసుల‌కు స్థానికులే ఇచ్చారు. అప్ప‌టి నుంచి సురేశ్ కోసం వేట ప్రారంభించారు పోలీసులు. అయితే త‌మ గ్రామ గారాల‌ప‌ట్టిని దారుణంగా హ‌త‌మార్చిన సురేశ్‌ను ప‌ట్టుకునేందుకు గ్రామ‌స్తులు మ‌రో వైపు గాలించ‌డం మొద‌లుపెట్టారు. జ‌రిగిన దారుణంపై ప్ర‌జాసంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. ఈ లోపు సురేశ్ ఏలూరు పాత‌బ‌స్టాండ్ స‌మీపంలో ఉన్నాడ‌ని త‌మ‌కుస‌మాచారం వ‌చ్చింద‌ని, అక్క‌డ‌కు వెళ్లేస‌రికి  రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకేసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పోలీసులు చెబుతున్నారు. స‌మాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసు జీపులో ఉన్న డెడ్‌బాడీని బయ‌ట‌కు లాగేసి మ‌రీ దాడి చేశారు. ఇదీ పోలీసుల క‌థ‌నం. అయితే చిన్నారికి జ‌రిగిన ఘోరం మ‌రెవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని..వెంటాడి వేటాడి సురేశ్‌ను ప‌ట్టుకున్న గ్రామ‌స్తులే చిత‌క్కొట్టి చంపేసి, బ్రిడ్జిపై నుంచి కింద‌కు తోసేశార‌ని ఏలూరులో స్థానికులు చెబుతున్నారు. 
హెచ్ఐవీ పేషెంట్ 
ఏలూరులో న‌డిరోడ్డుపై చంపారో, చ‌నిపోయాడో  తెలియ‌ని సురేశ్‌..ఓ మాన‌వ మృగం అంటున్నారు గ్రామ‌స్తులు. న‌ర‌రూప రాక్ష‌సుడని చెబుతున్నారు ఇరుగుపొరుగు వారు. పాత నేర‌స్తుడ‌ని పోలీసుల రికార్డుల్లో ఉంది. హాస్పిట‌ల్ వైద్య‌ప‌రీక్ష‌ల ప్ర‌కారం సురేశ్ ఓ హెచ్ ఐవీ పేషెంట్ అట‌. చాలా రోజులుగా ఎయిడ్స్‌తో బాధ‌ప‌డుతున్న సురేశ్ మాన‌సిక రోగి కూడా అని స్థానికులు చెబుతున్నారు. 
విచార‌ణ‌లో 6 కేసులు
గ‌తంలో హ‌త్య‌, అత్యాచార కేసుల్లో నిందితుడైన సురేశ్‌పై ఆరు వ‌ర‌కూ కేసులు వివిధ స్టేష‌న్ల‌లో ఉన్నాయి. ఇవ‌న్నీ విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయ‌ని స‌మాచారం. వీటిలో దొంగ‌త‌నాల‌కు సంబంధించిన కేసులు, అత్యాచారంపై న‌మోదైన కేసులున్నాయి. ఒక నేర‌స్తుడికి స‌కాలంలో శిక్ష ప‌డ‌క‌పోతే ఎంత ప్ర‌మాదమో సురేశ్ ఘ‌ట‌న రుజువు చేసింది.
మేన‌త్త‌, క‌న్న‌కూతురుపై అత్యాచారం
సురేశ్ నేరాల చిట్టాకు అంతే లేద‌ని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. సురేశ్ పాల్ప‌డిన  ఘోరాలు గురించి గ్రామ‌స్తులు చెబుతుంటే..మ‌నిషి కాదు మృగం అనేది రూఢి అవుతుంది. మేన‌త్త‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌పై ఇది వ‌ర‌కే కేసు న‌మోదైంది. క‌న్న‌కూతురు, చంటిపిల్ల‌పై కూడా అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఇది చూసిన భార్య‌, పిల్ల‌ల‌ను తీసుకుని క‌న్న‌వారింటికి వెళ్లిపోయింద‌ట‌.
క‌న‌డ‌మే నేరమా?
లావ‌ణ్య‌పై హ‌త్యాచారం చేయ‌డం, ట్రంకుపెట్టెలోనుంచి బాలిక శవం బ‌య‌ట‌ప‌డ‌డంతో గ్రామ‌స్తులు ఆగ్ర‌హోద్ర‌గులై సురేశ్ క‌న్న‌త‌ల్లిదండ్రులైన లక్ష్మి, వెంకటేశ్వరరావుపై కూడా గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. త‌ల్లి ల‌క్ష్మికి ఈ దాడిలో గాయాల‌య్యాయి. తండ్రిని పోలీసులు ర‌క్షించారు. క‌న్న‌కొడుకు క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తుడు కావ‌డంతో ఆ త‌ల్లిదండ్రుల‌కూ శిక్ష త‌ప్ప‌లేదు.