మోడీ కోసం 3 విమానాల దారి మళ్లింపు

చాలా ముఖ్య‌మైన వ్య‌క్తుల కోసం రోడ్డు మీద ట్రాఫిక్‌ను ఆప‌డం మ‌న‌కు చిర‌ప‌రిత‌మే. ఒకవేళ ఏదైనా బహిరంగ సభలో సీఎం పాల్గొంటుంటే ఆ దారిలో ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేయడమూ మనకు తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోడీ రూటే సెపరేటు. ఆయన కోసం రోడ్డుపైనే కాదు ఆకాశంలోనూ ట్రాఫిక్‌ను నియ‌త్రిస్తారు మ‌న అధికారులు. ఇంకో ముక్క‌లో చెప్పాలంటే… ఏకంగా ఎయిర్‌ ట్రాఫిక్కు(విమానాల రద్దీ)నే మళ్లించేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం మథురలో ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వచ్చే సమయంలో, ప్రధాని ప్రయాణం కోసం.. అధికారులు మూడు విమానాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.15 గంటల మధ్యలో.. ముంబై నుంచి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌, ఖాట్మండు నుంచి వస్తున్న ఇండిగో, గోవా నుంచి వస్తున్న విస్తారా విమానాలను లక్నోకు మళ్లించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్ర‌ధానా? మ‌జాకా?