8, 9 తేదీల్లో ‘బత్తిని’ చేప ప్రసాదం

మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు జూన్‌ 8, 9 తేదీలలో బత్తిని సోదరులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. నాంపల్లి ఎగ్జి బిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు హరినాథ్‌ గౌడ్‌, ఉమా మహేశ్వర్‌ గౌడ్‌ తెలిపారు. 1845 నుంచి ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా నాలుగు తరాలుగా చేప ప్రసాదాన్ని తాము అందజేస్తున్నామన్నారు. సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఉబ్బసం వ్యాధి తగ్గుము ఖం పడుతుందనుకున్న వారే వస్తున్నారని, ఇప్పటి వరకు దేశ, విదేశాలకు చెందిన వారు చేప ప్రసాదాన్ని తీసుకున్నారన్నారు. జూన్‌ 8 రాత్రి 11.45 నుంచి 9వ తేదీ రాత్రి వరకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పొందలేని వారి కోసం దూద్‌బౌలిలోని తమ నివాసంతోపాటు తమ సోదరుడి నివాసం వద్ద మూడు రోజుల పాటు ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. చేప ప్రసాదం తీసుకోదలచిన వారు మూడు గంటల ముందు వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరాదని, ప్రసాదాన్ని తీసుకున్న తరువాత గంటన్నర వరకు ఏమీ తినవద్దన్నారు.