వడదెబ్బకు ఒక్కరోజే 146 మంది బలి

నెమళ్లు నేలరాలుతున్నాయి. కుందేళ్లు కుదేలై ప్రాణాలు విడుస్తున్నాయి. ఇక… మనిషన్నవాడు అడుగు బయటపెడితే, మాడు పగిలిపోతోంది. ఇది సూర్య ప్రతాపం! భానుడు సృష్టిస్తున్న బీభత్స, భయానక ‘వాతావరణం’! నింగిలో సూరీడు నేలపై నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాడు. రెండు మూడు రోజులుగా సుర్రుమంటూ చిర్రెత్తిస్తున్న సూర్యుడు గురువారం మరింత రెచ్చిపోయాడు. బీభత్సంగా మండి… భయానక ‘వాతావరణం’ సృష్టించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజులోనే ఎండ దెబ్బకు 146 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క ఏపీలోనే 61 మంది మృత్యువాతకు గుర‌య్యారు. గురువారం అత్యధికంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సూర్య ప్రతాపం 47.5 డిగ్రీలను చూపింది. నిజామాబాద్‌లో, ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌ల్లో 47 డిగ్రీలను తాకింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ‘ఉమ్మడి’ రాజధాని హైదరాబాద్‌లో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఐదేళ్ల రికార్డు. 2010 మే 12న 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. ఈసారి పరిస్థితి చూస్తే… ఈ రికార్డు కూడా చెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రెండు రోజుల్లో 46 దాటినా దాటొచ్చనే హెచ్చరిక జారీ అయింది. రెండు మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని బేగంపేట వాతావరణ శాఖ అధికారి నర్సింహరావు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలైంది. జనం ఇళ్లు విడిచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తారు. సూర్యుడు విధించిన కర్ఫ్యూకు జడిసిపోయారు. అజా గ్రత్తగా ఉన్న వారు వడదెబ్బ తిన్నారు. సాధారణానికి మించి నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 
ఒక్కరోజే వడదెబ్బకు తెలంగాణలో 85 మంది చ‌నిపోయారు. ఖమ్మంలో 22, కరీంనగర్‌లో 21, నల్లగొండలో 20, పాలమూరులో 7, రంగారెడ్డిలో 5, మెదక్‌లో 5, ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 1 చ‌నిపోగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం (22), నెల్లూరు (8), గుంటూరు (7), తూర్పుగోదావరి (6), శ్రీకాకుళం (6), , కర్నూలు (3), కృష్ణాజిల్లా (3), చిత్తూరు (2), విశాఖ (1) కడప (1), విజయనగరంలో ఇద్ద‌రు చ‌నిపోయారు. ‘పొలిటికల్‌ టూర్ల’పై సూర్య ప్రతాపం కనిపిస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు.