జ‌య కేసు ఖ‌ర్చు క‌ర్ణాట‌క‌కు రూ. 100 కోట్లు!

జయ కేసు విచారణ వల్ల కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, దీన్ని ఎవ‌రు భ‌రించాల‌ని కన్నడ ప్రజాసంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జయ అక్రమాస్తుల కేసు విచారణ 1997 నుంచి 18 ఏళ్ల పాటు సాగింది. జయలలిత అక్రమాస్తుల కేసులో సీబీఐ 1996లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 1997 నుంచి 2002 వరకు ఈ కేసు విచారణ తమిళనాడులోనే సాగింది. 2002లో జయలలిత సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆమెకు వ్యతిరేకంగా తమిళనాడు కోర్టులో ఎవరూ సాక్ష్యం చెప్పలేరని, విచారణను బెంగళూరుకు మార్చాలని ప్రతిపక్షంలోని డీఎంకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో 2003 నుంచి ఈ కేసు విచారణ బెంగళూరులోనే జరుగుతోంది. ఈ సమయంలో కర్ణాటక ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. సాక్షులను కాపాడేందుకు.. కర్ణాటక ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. గత ఏడాది సెప్టెంబరు 27న జయను దోషిగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమిళనాడు, కర్ణాటక నడుమ 25 రోజులపాటు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. పలు కర్ణాటక బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో సుమారు రూ.50 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు తెలిపారు. చివరికి.. ఆమెను దోషిగా నిర్ధారించారు. అంతలోనే… హైకోర్టు ఆమెను నిర్దోషిని చేసింది. దీంతో… 18 ఏళ్ల పాటు జరిగిన విచారణ సంగతిని ప‌క్క‌న పెడితే… ఈ కేసు బాప‌తు అయిన ఖ‌ర్చును తామెందుకు భ‌రించాల‌న్న‌ది క‌ర్ణాట‌క పౌరుల వాద‌న. నిజ‌మే క‌దా!