బాబూ ఒట్టేసి చెప్పు: నారాయణ

శేషాచలం ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది స్మగ్లర్లు కాదని.. వారు కూలీలేలని సీఎం చంద్రబాబు, డీజీపీ రాముడు ఒట్టేసి చెప్పాల‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండు చేశారు. దేవుడిపై ప్రమాణం చేసి చెబితే తానూ న‌మ్ముతాన‌ని అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు నమ్మకం లేకపోయినా దేవుడి ముందు ప్రమాణం చేసి చెబుతున్నానంటూ శేషాచలంలో స్మ‌గ్ల‌ర్ల పేరుతో కూలీలనే చంపారన్నారు. దేవుడిపై న‌మ్మ‌కం లేని తానే ఒట్టేసి చెబుతుంటే దేవుడిపై నమ్మకం ఉన్న సీఎం, డీజీపీ చనిపోయింది స్మగ్లర్లు కాదని కూలీలేన‌ని ఎందుకు ప్రమాణం చేసి చెప్ప‌లేర‌ని ప్ర‌శ్నించారు.  వారు అలా చెప్పిన‌పుడే తాను ఆ ఎన్‌కౌంట‌ర్  విషయంలో విమర్శలు మానేస్తానని పేర్కొన్నారు. సీఎం, తనతో సహా ఈ జిల్లావాసులందరికీ నార్కో ఎనాల‌సిస్‌ పరీక్షలు నిర్వహిస్తే అస‌లు స్మగ్లర్లు బయటపడతారని అన్నారు. నాయకుల శిష్యులే స్మగ్లింగ్‌ చేస్తున్నారన్నారు.