ఎంసెట్ నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

హైద‌రాబాద్: మెడిక‌ల్‌, ఇంజినీరింగ్ కామ‌న్ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌కు రంగం సిద్ధం చేశారు. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంజినీరింగ్ ఎంట్ర‌న్స్ ప్రారంభ‌మై మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ముగుస్తుంద‌ని ఈ ప‌రీక్ష‌ల క‌న్వీన‌ర్‌, కాకినాడ జేఎన్‌టీయూ వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ వి.ఎస్.ఎస్. కుమార్  తెలిపారు. మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వ‌ర‌కు మెడిసిన్ ఎంట్ర‌న్స్ జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 2,55,381 మంది హాజ‌ర‌వుతున్నార‌ని, ఇందులో ఇంజినీరింగ్‌కు 1,70,663 మంది, మెడిసిన్ 84,718 మంది విద్యార్థులున్నార‌ని తెలిపారు. బ‌స్సులు స‌మ్మెలో ఉన్న దృష్ట్యా ముందుగా గమ్య స్థానాల‌కు చేర‌డం మంచిద‌ని, వీలైతే ముందుగా ప‌రీక్ష‌ల కేంద్రానికి ద‌గ్గ‌ర‌లో ఉండే  బందువుల ఇళ్ళ వ‌ద్ద‌కు చేరుకుంటే మంచిద‌ని ఆయ‌న అన్నారు. అఖ‌రి నిమ‌షంలో ప్రిప‌రేష‌న్ కంటే గ‌మ్య‌స్థానాల‌కు ముందుగా చేరుకుంటే టెన్ష‌న్ ఉండ‌ద‌ని ఆయ‌న తెలిపారు. హాల్ టిక్కెట్లు మ‌రిచిపోవ‌ద్ద‌ని, పెన్సిల్‌, ర‌బ్బ‌ర్ ఎక్స్‌ట్రా తీసుకెళితే మేలని సూచించారు. కాలేజీలు, పాఠ‌శాల‌ల‌కు సంబంధించిన బ‌స్సులు కూడా విద్యార్థుల‌ను చేర్చేందుకు ఉప‌యోగిస్తామ‌ని తెలిపారు. విద్యార్థుల సౌక‌ర్యార్థం హైద‌రాబాద్‌లోనూ ఏపీ ఎంసెట్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌త్య‌మ్నాయ ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అంటున్నారు. ఎవ‌రికైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నెంబ‌ర్ 18004256755 కు ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. కాగా అర‌గంట ఆల‌స్య‌మైనా ప‌రీక్ష‌కు అనుమ‌తిస్తామ‌ని మంత్రి గంటా తెల‌ప‌గా… బ‌స్సులు స‌మ్మెలో ఉన్న‌ప్ప‌టికీ ప‌రీక్ష‌కు నిమ‌షం ఆల‌స్య‌మ‌యినా అనుమ‌తించ‌బోమ‌ని అధికారులు చెప్ప‌డం విద్యార్థులు ఆయోమ‌యానికి గుర‌వుతున్నారు. దీనిపై ఈ రాత్రికి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కాకినాడ విసీ కుమార్ తెలిపారు.