ప్రేమికురాలితో పురుగుల మందు తాగించిన ప్రబుద్ధుడు

రాజ‌మండ్రి : ప్రేమపేరుతో బాలికతో సహజీవనం చేసిన యువకుడు ప‌థ‌కం ప్ర‌కారం ఆమె ప్రాణం తీశాడు. గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన సిద్దాబత్తుల శాంతి(15) అనే బాలిక.. అదే గ్రామానికి చెందిన గుడుపూడి రారాజు అనే ఇంటర్‌ విద్యార్థి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా సహజీవనం చేస్తున్నారు. గతనెల 29న శాంతికి ఫోన్‌చేసి జగ్గంపేటలోని పోలవరం కాల్వ వద్దకు రమ్మని చెప్పాడు. అక్కడికొచ్చిన బాలికతో తమ ప్రేమవ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలిసిందని, పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పాడు. చావు ఒక‌టే ప‌రిష్కారం అంటూ ఇద్దరం కలిసి చనిపోదామని చెప్పాడు. ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందును ప్లాన్‌ ప్రకారం మొదట ఆమెతో తాగించాడు. దీంతో స్పృహతప్పి పడిపోయిన శాంతిని మామిడాడలోని ఆమె పినతల్లి ఇంటికి తీసుకెళ్లి అనారోగ్యంతో పడిపోయిందని చెప్పి అక్క‌డి నుంచి పరారయ్యాడు. దీంతో ఆమె.. శాంతి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో ఏలూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ శాంతి గతరాత్రి మృతి చెందింది. శాంతి మృతిపై ఫిర్యాదు అందుకున్న పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్‌.. నిందితుడు రారాజును పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఆయన తెలిపారు.