రీతూ మొగుడే ఆమె పాలిట య‌ముడు

అనేక మ‌లుపులు తిరిగిన ఎయిర్ హోస్టెస్ రీతూ కేసులో ఆమెది హ‌త్య‌గానే పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. మొద‌ట‌గా ఆత్మ‌హ‌త్య‌గా భావించిన పోలీసులు ఆ త‌ర్వాత త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ కేసును అనుమానాస్ప‌ద మృతిగా న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు. ఈ కేసులో మొద‌ట పోస్ట్‌మార్టంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వ‌గా ఆ త‌ర్వాత త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు మ‌లుపు తిరిగి రీతూ మృత‌దేహాన్ని రీ పోస్టుమార్టం చేశారు. ఇందులో అనేక విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ఆమె ఒంటిపై గాయాల‌ను గ‌మ‌నించ‌డం, ఊపిరాడ‌క శ్వాస ఆగి మ‌ర‌ణించ‌డం వంటి అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి.  దీంతో పోలీసులు రీతూను ఆమె భ‌ర్త స‌చినే హ‌త్య చేసిన‌ట్టు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత స‌చిన్‌ను ప్ర‌శ్నించ‌గా అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రీతూ చ‌నిపోయిన రోజు ఆమె, భ‌ర్త స‌చిన్ టీవీ రిమోట్ కోసం ఘ‌ర్ణ‌ణ ప‌డిన‌ట్టు తెలిసింది. ఈ వివాదం స్నేహితుడు రాకేష్ ముందే జ‌ర‌గ‌డంతో అవ‌మానంగా భావించిన స‌చిన్ రీతూను దిండును ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడ‌కుండా చేసి చంపేసిన‌ట్టు వెలుగులోకి వ‌చ్చింది. రీతూపై అకార‌ణంగా స‌చిన్ ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్నాడ‌ని, ఉద్యోగ విధుల్లో భాగంగా ఆమె అంద‌రితోను స‌న్నిహితంగా ఉండ‌డంతో దాన్ని స‌చిన్ త‌ట్టుకోలేక పోయాడ‌ని, అందంగా ఉండ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌ని ఆమె త‌ల్లిదండ్రులు చెప్పారు. ఈ కార‌ణాల‌తోనే ఆమెను ఉద్యోగం మాన్పించి వేశాడ‌ని తెలిపారు. చాలాకాలం నుంచి రీతూపై నిప్పులు క‌క్కుతున్న స‌చిన్ అద‌ను చూసి చంపేశాడ‌ని వారు చెప్పారు. ఇదేదో క్ష‌ణికావేశంలో చేసిన హ‌త్య కాద‌ని వార‌న్నారు.