త్రిషపై ఎన్ కౌంటర్ ఎఫెక్ట్

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తమిళ రాజకీయ పార్టీలు, అభిమాన సంఘాలు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై బాగానే పడింది. ఏపీలో షూటింగులు చేయొద్దని ఇప్పటికే తమిళ హీరో హీరోయిన్లకు హెచ్చరికలు చేశాయి అక్కడి సంఘాలు. ఇదిలా ఉండగా తమిళనాట విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి లాంటి తెలుగు సినిమాల్ని కూడా అడ్డుకుంటున్నాయి. ఇప్పుడీ సెగ హీరోయిన్ త్రిషను కూడా తాకింది. చెన్నై బ్యూటీపై అక్కడి అభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు గుర్రుగా ఉన్నాయి.

శేషాచలం ఎన్ కౌంటర్ లో 20మంది హతమైన కొద్ది రోజులకే లయన్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ కు హీరో బాలయ్యతో పాటు హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఓ తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరైందని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేయడం ఒక ఎత్తయితే ఆ ఫంక్షన్ కు స్వయంగా ముఖ్యమంత్రి హాజరుకావడం, త్రిష-చంద్రబాబు నవ్వుతూ ఫొటోలకు పోజులివ్వడం తమిళులకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే ఏపీ అంటే కోపంతో ఊగిపోతున్న తమిళ జనం, తమిళ ఇండస్ట్రీ త్రిషకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.