అటకెక్కిన హాస్టల్స్ పథకం

రాష్ట్రంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మూడేళ్ల క్రితం ప్రారంభమైన హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదలైనా మూడేళ్ల నుంచి ఇప్పటివరకు 10 శాతం హాస్టళ్లను కూడా నిర్మించలేదు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షణ కొరవడంతో కోట్ల రూపాయల నిధులున్నా ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బాలికా విద్య అథోగతిలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో చదువుకు దూరంగా ఉన్న బాలికలను విద్యుకు చేరువచేసే ప్రధాన ఉద్దేశంతో 2012లో కేంద్రప్రభుత్వం హాస్టళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అమలుకుగాను కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులను భరించాల్సి ఉంది. ఈ పథకం ప్రకారం ఎంపిక చేసిన మోడల్ స్కూళ్ల పరిధిలో బాలికా హాస్టల్ ను ఏర్పాటు చేసి అందులో 9, 10 తరగతుల, ఇంటర్ విద్యార్థినులను చదివించాల్సి ఉంది. ప్రతి హాస్టల్ లోనూ 100 మంది విద్యార్థినులు ఉండేందుకు వీలుగా 25 గదులు, వారికి అవసరమైన వంటగది, భోజనాల గది, వార్డెన్ గదులతోపాటు చిన్నపాటి లైబ్రరీ, రిక్రియేషన్, సెక్యూరిటీ గదులను ఏర్పాటు చేయాలి. అన్ని వసతులతోనూ వీటిని నిర్మించేందుకు ఒక్కొక్కదానికీ రూ.1.28 కోట్లు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిదశలో 355 హాస్టళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. రాష్ట్రం విడిపోవడంతో ప్రస్తుతం ఏపీలోని 13 జిల్లాల్లో 163 హాస్టళ్లు నిర్మించాల్సి ఉంది. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.210.91 కోట్లను ఉమ్మడి రాష్ట్రానికి మంజూరు చేసింది. రాష్ట్ర వాటా కింద 10 శాతం నిధులు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మారిన లెక్కల ప్రకారం ఏపీలో 163 హాస్టళ్లకు రూ.107.60 కోట్లు మంజూరైనట్టు విద్యాశాఖ రికార్డుల్లో పేర్కొంది. మరోపక్క, విడుదలైన 107.60 కోట్లలో రూ.53.64 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు విడుదల చేసింది. ఈ క్రమంలో మరో రూ.53.95 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే నిల్వ ఉన్నాయి. కాగా, నిధులు అవసరమైన ఏడాదిలోగా ఈ డబ్బును పూర్తిగా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు విడుదల చేసిన నిధులు చాలా చోట్ల ఇంకా ఖర్చు కాలేదు. మరోపక్క హాస్టళ్ల నిర్మాణం పూర్తయిన చోట కూడా అవి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

నత్తనడకన పనులు..
వివిధ జిల్లాల్లో హాస్టళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మూడేళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 12 హాష్టళ్లను మాత్రమే నిర్మించారు. కొన్నింకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరికొన్నింటిని ప్రారంభించనేలేదు. శ్రీకాకుళం జిల్లాలో 14 హాస్టళ్లు నిర్మించాల్సి ఉండగా, ఒక్క నిర్మాణాన్నీ మొదలుపెట్టలేదు. విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే విశాఖపట్నంలో 4, తూర్పుగోదావరిలో 1, కర్నూలులో 7 హాస్టళ్లను మాత్రమే నిర్మించారు. రాష్ట్రీయ మాధ్యమిక మిషన్ ఆధ్వర్యంలో అమలు కావాల్సిన ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్నేయడంతో ఈ దుస్థితి నెలకొంది. కిందిస్థాయిలో విద్యాశాఖాధికారులు లేకపోవడం, ఇన్ చార్జిలే ఉండడం, నిధుల విషయంలో వారు ఆచితూచి వ్యవహారించడంతో వచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయకుండా వదిలేస్తున్నారు.